వైద్యుల నిర్వాకం: బతికున్నా చంపేశారు..!

5 Jul, 2021 07:46 IST|Sakshi
తేని ప్రభుత్వ ఆస్పత్రి( ఫైల్‌ ఫోటో)

విచారణకు ఆదేశం 

సాక్షి, చెన్నై: పుట్టిన శిశువు ఊపిరి ఆడక మరణించినట్లు తేని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. అయితే అంత్యక్రియల సమయంలో శిశువులో కదలికలు రావడంతో అదే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తేని జిల్లా పెరియకుళం సమీపంలోని తామరైకుళానికి చెందిన రాజ, ఆరోగ్య మేరి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడో సారి ఆరోగ్య మేరి గర్భం దాలి్చంది. ఆరో నెల పూర్తి కావస్తున్న తరుణంలో శనివారం ఆమెకు పురుటి నొప్పులు వచ్చాయి.

తేని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి 12.30 గంటలకు ఆమెకు ఆడ బిడ్డ పుట్టింది. అయితే బిడ్డ బరువు 200 గ్రాములే ఉండడంతో వెంటిలేటర్‌ చికిత్సలో ఉంచారు. ఆదివారం వేకువ జామున 3.30 గంటలకు శ్వాస అందకుండా ఆ శిశువు మరణించినట్లు వైద్యులు తేల్చారు. మృతదేహాన్ని ప్యాకింగ్‌ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. శిశువును కాసేపు ఇంటి వద్ద ఉంచి, ఆ తర్వాత సమీపంలోని క్రైస్తవ శ్మశాన వాటికలో ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ కమ్రంలో శిశువులో కదలికలు రావడంతో హుటాహుటిన అదే ఆస్పత్రికి తరలించారు. శిశువు ప్రాణాలతోనే ఉన్నట్లు గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి  డీన్‌ బాలాజీ నాథన్‌ మాట్లాడుతూ.. బిడ్డను సరిగ్గా పరీక్షించకుండా మరణించినట్లు నిర్ధారించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు