కుల్ఫీ తిన్న 65 మంది చిన్నారులు ఆసుపత్రిపాలు

10 Jun, 2023 08:20 IST|Sakshi

ఆనందంగా గంతులేసుకుంటూ కుల్ఫీ తిన్న ఆ 65 మంది పిల్లలు ఉన్నట్టుండి అనారోగ్యం బారినపడి ఆసుపత్రి పాలయ్యారు. కుల్ఫీ తిన్న వెంటనే వారు కడుపునొప్పితో తల్లడిల్లి పోయారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

రాజస్థాన్‌లోని అల్వర్‌ జిల్లాలో కుల్ఫీ తిన్న 65మంది పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. కడుపునొప్పి, వాంతులతో తల్లడిల్లిపోతున్న ఆ చిన్నారులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పిల్లలు ఏ వెండర్‌ దగ్గర నుంచి కుల్ఫీలు కొనుగోలు చేశారో, వాటి శాంపిల్స్‌ను అధికారులు సేకరించి, పరిశీలన కోసం పంపించారు.

ఆరోగ్యశాఖ అధికారి ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ ఈ ఘటన రాజగఢ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఖుర్ద్‌ గ్రామంలో చోటుచేసుకున్నదన్నారు. చిన్నారులు ఒక వెండర్‌ దగ్గర కుల్ఫీలు కొనుగోలు చేశారు. వాటిని తిన్నవెంటనే వారికి కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. ఒక్కక్కరుగా పిల్లలంతా  అనారోగ్యం బారినపడ్డారు. వెంటనే స్థానికులు వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు.

వీరిలో కొందరు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగా, మరికొందరు చిన్నారులు ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరికి చికిత్స అందిస్తున్న వైద్యులు డాక్టర్‌ శ్రీరామ్‌ శర్మ మాట్లాడుతూ బాధిత చిన్నారులకు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం 50 మంది చిన్నారులు కోలుకోగా, వారిని వారి ఇళ్లకు పంపించామన్నారు. మరో 15 మంది చిన్నారులకు ఇంకా చికిత్స కొనసాగుతోంది. వీరు తిన్న కుల్ఫీ శాంపిల్‌ను పరిశీలన కోసం ల్యాబ్‌కు పంపించామన్నారు. 

చదవండి: రైతు ప్రాణాలు కాపాడిన ఆవు

మరిన్ని వార్తలు