‘వ్యాక్సినేషన్‌ తర్వాత సీఏఏ అమలు’

12 Feb, 2021 06:08 IST|Sakshi

హోం మంత్రి అమిత్‌ షా వెల్లడి

కోల్‌కత: దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేస్తామని హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. సీఏఏ అమలుతో దేశంలోని మైనారిటీల పౌరసత్వ హోదాకు భంగం కలుగుతుందంటూ ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. 2018లో వాగ్దానం చేసిన విధంగానే మోదీ ప్రభుత్వం వలస ప్రజలకు భారత పౌరసత్వం అందజేసే సీఏఏను అమలు చేసి తీరుతుందన్నారు.

కోవిడ్‌–19 మహమ్మారి కారణంగానే సీఏఏ అమలు తాత్కాలికంగా వాయిదాపడిందని వివరించారు. పశ్చిమ బెంగాల్‌లోని మటువా వర్గం వలస ప్రజలు ఎక్కువగా ఉండే ఠాకూర్‌నగర్‌లో గురువారం జరిగిన ర్యాలీలో మంత్రి ప్రసంగించారు. ‘సీఎం మమతా దీదీ సీఏఏను వ్యతిరేకించారు. దాన్ని అమలు చేయనీయమని అంటున్నారు. ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేరుస్తుంది. సీఏఏను అమలు చేస్తుంది. మటువాలు సహా వలస వచ్చిన వారందరికీ పౌరసత్వం అందజేస్తాం’ అని చెప్పారు. దేశంలోని మైనారిటీలెవరికీ కూడా సీఏఏతో నష్టం కలగదని స్పష్టం చేశారు.

బంగ్లాదేశ్‌ నుంచి రాష్ట్రంలోకి వలసలను టీఎంసీ ప్రభుత్వం ఆపలేకపోతోందనీ, తాము మాత్రమే వారిని నిలువరించగలమనీ అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మూడింట రెండొంతుల స్థానాలను దక్కించుకునే దాకా తమ పోరు ఆగదని చెప్పారు. అంతేకాదు, రాష్ట్రాన్ని స్వర్ణ బెంగాల్‌(సోనార్‌ బంగ్లా)గా మారుస్తామన్నారు. బెంగాల్‌లో గెలుపుతో ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోనూ తమ గెలుపునకు బాటలు పడతాయన్నారు. బెంగాల్‌లో 2కోట్ల మందికి పార్టీ లక్ష్యాలు, సందేశాలు చేర్చాలని సోషల్‌ మీడియా బృందానికి షా చెప్పారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌ నుంచి భారత్‌లోకి సుమారు 30 లక్షల మంది మటువా వర్గానికి చెందిన ప్రజలు వలస వచ్చారు. రాజకీయంగా ఎంతో కీలకమైన వీరి ఓట్ల కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

మరిన్ని వార్తలు