అరుదైన హాబీ.. ఇల్లు దాటకుండానే

19 Dec, 2020 11:21 IST|Sakshi

వేర్వేరు దేశాల అగ్గిపెట్టెలు కలెక్ట్‌ చేసిన చిన్నారి

5 వేల అగ్గిపెట్టెలు సేకరించిన చిన్నారి

భువనేశ్వర్‌: మనలో చాలా మందికి వేర్వేరు హాబీలు ఉంటాయి. కొందరికి వివిధ దేశాల కరెన్సీ, జాతీయ జెండాలు వంటివి కలెక్ట్‌ చేసే అలవాటు ఉంటే.. మరి కొందరికి అందమైన ఫోటోలు కలెక్ట్‌ చేయడం హాబీ. ఈ క్రమంలో భువనేశ్వర్‌కు చెందిన మూడవ తరగతి విద్యార్థి దిబ్యాన్షికి అగ్గిపెట్టలు కలెక్ట్‌ చేయడం సరదా. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాలకు చెందిన 5000 అగ్గిపెట్టలను సేకరించింది. అయితే వీటిని సేకరించడానికి బాలిక ఆయా దేశాలకు వెళ్లలేదు. బంధవులు, స్నేహితులు ఎవరైనా విదేశాలకు వెళ్లినప్పుడు వారిచేత వీటిని తెప్పించేదట. ఈ సందర్భంగా దిబ్యాన్షి మాట్లాడుతూ.. ‘మా నాన్న వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌. దాంతో వేరు వేరు ప్రాంతాలు, దేశాలకు తిరిగే వాడు. అలా వెళ్లిన ప్రతిసారి నా కోసం అగ్గిపెట్టెలు తెచ్చేవాడు. అలానే మా బంధువులు, స్నేహితులు విదేశాలకు వెళ్తే నా కోసం అగ్గిపెట్టెలు తెమ్మని కోరేదాన్ని. ఇలా సేకరించిన వాటిని ఒక థీమ్‌ ప్రకారం అరెంజ్‌ చేశాను’ అని దిబ్యాన్షి ఏఎన్‌ఐకి తెలిపింది.

ఈ సందర్భంగా దిబ్యాన్షి తల్లి గోపా మొహంతి మాట్లాడుతూ.. ‘నా భర్త వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఓ సారి తన స్నేహితుడి కోసం అగ్గిపెట్టె తీసుకువచ్చాడు. దాని డిజైన్‌, ప్యాకింగ్‌ దిబ్యాన్షికి చాలా నచ్చింది. దాన్ని తన దగ్గరే ఉంచుకుంటాను అని కోరింది. ఇలా మూడేళ్ల నుంచి అగ్గిపెట్టెలు సేకరిస్తుంది. వీటిని థీమ్‌ ప్రకారం ప్లాస్టిక్‌ పెట్టెల్లే భద్రపరుస్తాము’ అని తెలిపారు. 

>
మరిన్ని వార్తలు