యూనివర్సిటీ పరీక్షలో కులం గురించి ప్రశ్నా? బాధ్యత ఉండక్కర్లే..?

17 Jul, 2022 09:34 IST|Sakshi

చెన్నై: తమిళనాడు పెరియార్ యూనివర్సిటీ పరీక్షల్లో ఓ ప్రశ్నాపత్రంలో కులానికి సంబంధించిన ప్రశ్న అడగటం తీవ్ర దుమారం రేపింది. ఎంఏ హిస్టరీ మొదటి ఏడాది రెండో సెమిస్టర్ పరీక్ష గురువారం జరిగింది. అయితే ప్రశ్నాపత్రంలో 'కింది వాటిలో తమిళనాడుకు చెందిన తక్కువ కులం ఏది?' అనే ప్రశ్న వచ్చింది. జవాబు ఎంచుకునేందుకు నాలుగు కులాల పేర్లను ఆప్షన్లుగా ఇచ్చారు. 'ఫ్రీడం మూవ్‌మెంట్‌ ఆఫ్ తమిళనాడు ఫ్రం 1800-1947' అనే సబ్జెక్టు పరీక్ష రాసిన విద్యార్థులకు ఈ ప్రశ్న ఎదురైంది.               

అయితే పరీక్షలో కులానికి సంబంధించిన ప్రశ్న అడగటం వివాదాస్పదమైంది. దీనిపై పెరియార్ యూనివర్సిటీ ఉప కులపతి జగన్నాథన్ స్పందించారు. సమాజంలో అసమానతలు రూపుమాపే దిశగా విద్యను అందించాల్సిన ప్రొఫెసర్లు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే, ప్రశ్నాపత్రం తాము తయారు చేయలేదని, వేరే యూనివర్సిటీ సిబ్బంది రూపొందించారని జగన్నాథన్ తెలిపారు. క్వశ్చన్‌ పేపర్‌ లీక్ కాకూడదనే ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష జరిగే వరకు ప్రశ్నాపత్రాన్ని ఎవరూ చూడలేదని, అందులోని వివాదాస్పద ప్రశ్న గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. ఈ విషయంపై కచ్చితంగా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.

చదవండి: పిల్లాడు బూతులు మాట్లాడుతున్నాడు.. పొలిటికల్‌ లీడర్లు మాట్లాడుతుంటే టీవీ పెట్టారా..?

మరిన్ని వార్తలు