కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..

4 Jun, 2023 09:53 IST|Sakshi

జూన్‌ 2న ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో అత్యంత ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఒక గూడ్సు రైలును వెనుక నుంచి కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పి, పక్కనున్న ట్రాక్‌పైకి దొర్లాయి. ఆ సమయంలో ఆ ట్రాక్‌ మీదుగా యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ వెళ్తోంది. అవి యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్నాయి. దాంతో ఈ ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. అయితే గూడ్సును కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొనడమే ఘటనకు ప్రధాన కారణమని భావిస్తున్నారు.

అయితే కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ హౌరాలోని షాలీమార్‌ స్టేషన్‌ నుంచి చెన్నై వరకూ నడుస్తుంది. ఈ రైలు ప్రతిరోజూ నడుస్తుంది. అలాగే నాలుగు రాష్ట్రాల మీదుగా అంటే పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల గుండా ప్రయాణిస్తుంది. కోరమండల్‌ తీరం అనేది భారత్‌కు ఆగ్నేయ తీరం. కోరమండల్‌ తీరం వెంబడి నడుస్తున్నందునే ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఈ పేరు వచ్చింది. ఈ రైలులో ప్రయాణించేవారు కోరమండల్‌ తీరంలోని సుందర దృశ్యాలను తిలకించవచ్చు.

ఈ మార్గంలో దట్టమైన అడవులతో పాటు పలు చారిత్మాక, సాంస్కృతిక స్థలాలు కూడా దర్శనమిస్తాయి. కోరమండల్‌ తీరం సుమారు 22,800 చదరపు కిలోమీటర్ల మేరకు వ్యాప్తిచెందింది. ఇది సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తులో ఉంది. కోరమండల్‌ తీరం వ్యవసాయానికి కూడా ఎంతో పేరుగాంచింది. ఈ​ ప్రాంతంలో వరితో పాటు వివిధ రకాల పప్పు ధాన్యాలు కూడా పండుతాయి. చెరకు పంట కూడా పండుతుంది. అలాగే చేపల పెంపకం, షిప్పింగ్‌ లాంటి పరిశ్రమలకు నెలవుగా ఉంది.

మరిన్ని వార్తలు