హైకోర్టుల్లో కేసుల పరిష్కారం సగమే!

4 Sep, 2020 16:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సాధారణ పరిస్థితుల్లోనే పెండింగ్‌ కేసులు ఎక్కువ, సిబ్బంది తక్కువ కారణంగా న్యాయ వ్యవస్థలో కేసుల పరిష్కారం అంతంత మాత్రంగా కొనసాగుతుండగా, కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తోన్న ‘నేషనల్‌ జుడీషియల్‌ డాటా గ్రిడ్‌’ లెక్కల ప్రకారం హైకోర్టుల్లో కేసుల పరిష్కారం 50 శాతం పడిపోగా, వాటి దిగువ కోర్టుల్లో 70 శాతం పడి పోయాయి. గ్రిడ్‌లో సుప్రీం కోర్టు డాటా అందుబాటులో లేదు. అయితే లీగల్‌ ఆర్కివ్స్‌ వెబ్‌సైట్‌ ‘సుప్రీం కోర్టు అబ్జర్వర్‌’ కథనం ప్రకారం 2018, ఏప్రిల్‌ నెల నాటికి సుప్రీం కోర్టు 10,586 కేసులను, 2019లో ఏప్రిల్‌ నెలనాటికి, 12,084 కేసులను పరిష్కరించగా, 2020, ఏప్రిల్‌ నెల నాటికి కేవలం 355 కేసులను మాత్రమే పరిష్కరించగలిగింది.

మార్చి 24వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో హఠాత్తుగా కోర్టుల కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. ఆ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు అత్యవసర కేసుల విచారణ చేపట్టి, మిగితా కేసుల విచారణ పెండింగ్‌లో పడేసింది.. ఆ తర్వాత కేసుల్లో భౌతిక విచారణను పక్కకు పెట్టి వీడియో కాన్ఫరెన్స్‌ విచారణను చేపట్టింది. ఈ విషయంలో హైకోర్టులు కూడా సుప్రీం కోర్టునే అనుసరించాయి.

ఇప్పుడు వీడియో కాన్ఫరెన్ప్‌ విచారణలను పక్కకుపెట్టి భౌతిక విచారణను ప్రారంభించాలని హైకోర్టులు నిర్ణయించాయి. అయితే అస్సాం హైకోర్టు సిబ్బంది అందుకు సమ్మెతించడం లేదు. దేశంలో జిల్లా కోర్టులు మార్చి 28 నుంచి ఆగస్టు 28వ తేదీ మధ్య 12 లక్షల కేసులకుపైగా పరిష్కరించాయని, ఇదో మైలురాయని ‘సుప్రీం కోర్టు ఈ కమిటీ’ వెబ్‌సైట్‌ ప్రారంభోత్సవంలో డీవై చంద్రచూడ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు