సీడబ్ల్యూసీలో కీలక నిర్ణయాలు.. నాగపూర్‌లో భారీ బహిరంగ సభ

21 Dec, 2023 20:50 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం(CWC)లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  లోక్‌సభ ఎన్నికలకు సర్వసన్నదం కావాలని సమావేశంలో తీర్మానించారు. ఇండియా కూటమి కూడా ఎన్నికలకు రెడీ కావాలని ప్లాన్‌ చేశారు. కాంగ్రెస్‌ శ్రేణులన్నీ ఎన్నికల రంగంలోకి దూకాలని పిలుపునిచ్చారు. 

ఇంకా, నాగపూర్‌లో వచ్చే వారం కాంగ్రెస్‌ స్థాపన దినోత్సవం రోజున హే తయ్యార్‌ హమ్‌ పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ప్రేపరేషన్‌ కోసం ఇప్పటికీ రాష్ట్రాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నట్ట చెప్పారు. పార్లమెంట్‌లో 140 మంది ఎంపీల సస్పెన్షన్‌ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. విపక్షాలు లేకుండానే కీలకమైన క్రిమినల్‌ బిల్లులను పాస్‌ చేశారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ధరలు, నిరుద్యోగం పెరిగిందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేశారని విమర్శలు చేశారు. 

సీడబ్ల్యూసీ సమావేశం సందర్బంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరంలో ఆశించిన ఫలితాలు రాలేదు. భవిష్యత్తులో మా కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి కృషిచేసిన పార్టీ నేతలకు అభినందనలు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. వచ్చే లోకసభ ఎన్నికల్లో భావసారూప్యత కలిగిన సహచరులతో సమన్వయం చేసుకుంటూ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలి. మేము ఐదుగురు సభ్యులతో కూడిన జాతీయ కూటమి కమిటీని ఏర్పాటు చేశాము. ఇది ఇతర పార్టీలతో పొత్తుకు సంబంధించిన రూపురేఖలను నిర్ణయిస్తుంది. త్వరలో లోక్‌సభ స్థానాలపై సమన్వయకర్తలను కూడా నియమిస్తాం. డిసెంబర్ 28న కాంగ్రెస్ 138వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగ్‌పూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నాం. 

చర్చలు లేకుండానే ముఖ్యమైన బిల్లులను ఇష్టారాజ్యంగా ఆమోదిస్తూ ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తున్న బీజేపీని దేశం మొత్తం చూస్తోంది. పార్లమెంటును అధికార పార్టీకి వేదికగా మార్చే కుట్ర జరుగుతోంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పటి వరకు మన ఇండియా కూటమికి చెందిన 143 మంది ఎంపీలను ఉభయ సభల్లో సస్పెండ్ చేసిన తీరు దురదృష్టకరం. ప్రతిపక్షాలు లేకపోయినా ముఖ్యమైన బిల్లులన్నింటినీ ఆమోదిస్తూ పార్లమెంట్ గౌరవానికి విరుద్ధంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ మాట్లాడుతూ..‘76 మంది నేతలు సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్నారు. నాలుగు గంటల పాటు అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంటు అంశాలు, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తీర్మానాలు చేసింది.  
తెలంగాణలో ఏడాది క్రితం మేము మూడో స్థానంలో ఉన్నాము, అన్ని ఉప ఎన్నికల్లో ఓడిపోయాం. కానీ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 
పలు రాష్ట్రాల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశించాం, కానీ ఓడిపోయాం. 

మూడు రాష్ట్రాల్లో ఓటమి కాంగ్రెస్‌కు నిరాశ కలిగించింది, కానీ కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో బలంగా ఉంది మా ఓటు శాతం పదిలంగా ఉంది.  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో లోక్‌సభ ఎన్నికలకు వెళ్లడం ఆందోళన కలిగించడం లేదు. పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించాం, ఆలస్యం చేయకుండా అభ్యర్థులను ప్రకటిస్తాం. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు ఈ నెలలోనే స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తాం. ఒకటి రెండు రోజుల్లోనే మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తాం

ఇండియా కూటమి ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తోంది. గెలుపే లక్ష్యంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోరాడుతుంది. రెండో విడత భారత్ జోడో యాత్ర తూర్పు నుంచి పడమరకు చేయాలని అనేక మంది నేతలు రాహుల్ గాంధీని విజ్ఞప్తి చేస్తున్నారు.  భారత్ జోడో రెండో విడతపై త్వరలోనే నిర్ణయం ఉంటుంది. ఇండియా కూటమి పార్టీలతోని పొత్తు కోసం ఏఐసీసీ ఇప్పటికే ఒక కమిటీ వేసింది.  ఈ నెలలోనే పొత్తులపై చర్చలు ప్రారంభమవుతాయి. ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాలను త్వరగా తీసుకోవాలని నిర్ణయించాం. కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి రాష్ట్ర నాయకత్వం సూచించిన పేర్లను సీఈసీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నాం’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

>
మరిన్ని వార్తలు