భయపెడుతున్న బురేవి.. చెరువులా మారిన చెన్నై

5 Dec, 2020 07:58 IST|Sakshi

నేటి మధ్యాహ్నం తీరం దాటే అవకాశం 

17 జిల్లాలను ముంచెత్తిన భారీ వర్షాలు 

చెరువులా మారిన చెన్నై 

సాక్షి, చెన్నై: నివర్‌కు కొనసాగింపుగా పుట్టుకొచ్చిన బురేవి తుపాన్‌ రాష్ట్ర ప్రజలను భయపెడుతోంది. ఈ తుపాన్‌ శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామనాథపురం మీదుగా దక్షిణ, వాయవ్య దిశగా కేరళ వైపు పయనిస్తూ తీరందాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో కడలూరు, నాగపట్నం, తిరువారూరు జిల్లాల్లో భారీ వర్షాలు, తంజావూరు, పుదుకోట్టై, శివగంగై, విల్లుపురం, తిరువణ్ణా మలై, అరియలూరు, పెరంబలూరు, వేలూరు, తిరువళ్లూరు, రాణిపేట, కారైకాల్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నాలుగు రోజుల క్రితం బంగాళాఖాతం ఈశాన్యంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా, ఆ తర్వాత బురేవి తుపానుగా రూపాంతరం చెంది శ్రీలంక వైపునకు ప్రయాణించడం ప్రారంభించింది. గురువారం మధ్యాహ్నం శ్రీలంకను దాటి పాంబన్‌ ప్రాంతంలో కేంద్రీకృతమై కన్యాకుమారి మీదుగా తీరం దాటుతుందని చెన్నై వాతావరణ కేంద్రం అంచనావేసింది. గురువారం రాత్రే తుపాన్‌ బలపడడం ప్రారంభంకావడంతో రాష్ట్రంలోని దక్షిణ తమిళనాడులోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున రామనాథపురం సముద్ర తీరానికి సమీపంలో బురేవి తుపాను కేంద్రీకృతమైంది. ఈ కారణంగా కన్యాకుమారి జిల్లాకు ఈశాన్యం ప్రాంతంలో 50 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి.


తూత్తుకుడి, రామనాథపురం, శివగంగై, నాగపట్నం, కారైక్కాల్, పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, సముద్రతీర ప్రాంతాలు భారీ వర్షాలను చవిచూశాయి. రామనాథపురం, తూత్తుకుడి జిల్లాల వద్ద సముద్ర తీరానికి సమీపం మన్నార్‌వలైగూడా ప్రాంతంలో శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. బురేవి ప్రభావం వల్ల రాష్ట్రంలోని 17 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడలూరులో 34 సెంటీ మీటర్ల వర్షం పడడంతో చిదంబరం ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. తూత్తుకుడి, మదురై, కొచ్చికి చెన్నై నుంచి బయలుదేరాల్సిన 12 విమానాలు భారీ వర్షాల కారణంగా రద్దయ్యాయి.  చదవండి: (బురేవి తుపాన్‌: ఆ మూడు చోట్ల కల్లోలమే..)

చెన్నై నగరం కాదు చెరువు.. 
బురేవి తుపాను చెన్నై నగరంపై తీవ్ర ప్రభావం చూపింది. చెన్నై వరద నీటితో చెరువులా మారిపోయింది. చెన్నై శివారు ప్రాంతాలైన తాంబరం సహా అనేక ప్రాంతాల్లోని నివాసగృహాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. నివర్‌ తుపాను కారణంగా ప్రవహించిన నీటి నుంచి బయటపడకముందే బురేవి వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. చెన్నై శివార్లలోని ముడిచ్చూర్‌ పరిసరాల్లోని 20 నివాస ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెన్నైలోని అడయారు, రాయపేట, మైలాపూర్, ఎగ్మూర్, పురసైవాక్కం, గిండి, సైదాపేట ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది.

అశోక్‌నగర్‌లో ద్విచక్ర వాహనాలు మునిగిపోయేంతగా వరద నీరు ప్రవహించింది. చెన్నై, శివారు ప్రాంతాలు వరద నీటితో తేలియాడడంతో విధులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులకు గుర య్యారు. రెండు వారాలుగా కురుస్తున్న ఎడతెరపిలేని వర్షాల కారణంగా చెన్నై, శివారు ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. రోడ్లలో వరదనీటి ప్రవాహం వల్ల సిటీ బస్సులు నిలిచిపోవడంతో ప్రజలు విద్యుత్‌ రైళ్లపై ఆధారపడ్డారు. మందవెలి బస్సు డిపో నీట మునగడంతో ప్రయాణికులు చిక్కుకుపోయారు. బురేవి తుపాను కారణంగా చెన్నైలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.  

భారీ వర్షాలకు తొమ్మిది మంది మృతి.. 
బురేవి తుపాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు తొమ్మిది మందిని బలి తీసుకున్నాయి. లక్ష ఎకరాల్లో పంట వర్షార్పణమైంది. మైలాడుదురై జిల్లాకు చెందిన శరత్‌ కుమార్‌ (31) శుక్రవారం తెల్లవారుజామున రోడ్లో నడుస్తూ తెగిన విద్యుత్‌ తీగను తొక్కడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆరుంగాల్‌ గ్రామానికి చెందిన శివభాగ్యం (60) సైతం విద్యుదాఘాతంతో మరణించారు. తంజావూరు జిల్లా వడకాల్‌ చక్కర గ్రామానికి చెందిన శారదాంబాల్‌ (70) ఇంటి ప్రహరీ గోడ కూలడంతో శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. కుంభకోణం సమీపం ఎలుమిచ్చకాయ్‌ గ్రామానికి చెందిన కుప్పుస్వామి (70), ఆయన భార్య యశోద (65)పై ఇల్లు కూలడంతో ప్రాణాలు వదిలారు.

కడలూరుకు జిల్లాకు చెందిన సంజన (10) గోడ కూలి మృతిచెందింది. పెరియకాట్టు పాళయం గ్రామానికి చెందిన ధనమైయిల్‌ (55) సైతం ఇంటి గోడ కూలడంతో మృతిచెందింది. చెన్నై తండయారుపేటకు చెందిన కార్మికుడు సురేష్‌ (38) విధులకు రోడ్డులో నడిచి వెళుతుండగా తెగిన విద్యుత్‌ తీగపై కాలు వేసి కరెంటు షాక్‌కు గురై కన్నుమూశాడు. చెన్నై అడయారు చెరువులో వరద నీటిలో కొట్టుకొస్తున్న గుర్తుతెలియని పురుషుని శవాన్ని కనుగొన్నారు. చెరువులో వరద ప్రవాహం వేగంగా ఉండడంతో శవాన్ని ఒడ్డుకు చేర్చే ధైర్యం చేయలేకపోయారు. కడలూరు జిల్లాలోని చిదంబరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా నటరాజస్వామి ఆలయం ప్రాకారం మొత్తం నీట మునిగింది. 1977కు తర్వాత అంటే 43 ఏళ్ల తర్వాత ఆల యంలో నడుము లోతు నీళ్లు చేరాయి.  

నేడు కేంద్ర బృందం రాక.. 
రాష్ట్రంలో నివర్‌ తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి నష్టాలను అంచనావేసేందుకు కేంద్ర బృందం శనివారం తమిళనాడుకు చేరుకుంటోంది. తొలి రోజున కడలూరు, విల్లుపురం జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు