గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌ వర్ధంతి..

26 Apr, 2021 09:44 IST|Sakshi

ఇన్‌బాక్స్‌ 

శ్రీనివాస రామానుజన్‌ 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధ గణిత మేధావుల్లో  ఒకరు. తమిళనాడులో ఈరోడ్‌లోని ఓ నిరుపేద  కుటుంబంలో పుట్టిన రామానుజన్‌ చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. కుంభకోణంలోని ప్రభుత్వ కాలేజీలో చేరిన రామానుజన్‌ గణితంపైనే కేంద్రీకరించడంతో ఎఫ్‌.ఎ. పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేదు. ఆ తర్వాత మద్రాస్‌లోని వచ్చయ్యప్ప కళాశాలలో చేరి గణిత సమస్యలను సులభమైన రీతిలో తక్కువ సోపానాలతో సాధించేవాడు.

రామానుజన్‌ ప్రతిభను గుర్తించిన ప్రొఫెసర్‌ సింగారవేలు మొదలియార్‌ ఆయనతో కలిసి మ్యాథమెటికల్‌ జర్నల్స్‌లో క్లిష్టమైన సమస్యలపై చర్చించి వాటిని సాధించేవారు. 1913లో మద్రాస్‌ వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్‌ వాకర్‌ ఈ పరిశోధనలు చూసి నివ్వెరపోయారు. రామానుజన్‌ కనుగొన్న 120 పరిశోధన సిద్ధాంతాలను ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్‌ గాడ్‌ ఫ్రెహెరాల్డ్‌ హార్టీకి పంపాడు. మహా మేధావులకు మాత్రమే సాధ్యమయ్యే పరిశోధన ఫలితాలను చూసిన హార్టీ రామానుజ¯Œ ను కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు. 1914 మార్చిలో లండన్‌కు వెళ్లిన రామానుజన్‌ అక్కడ నిరంతరం  పరిశోధనలు చేసి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. 

జీవిత చరమాంకంలో రామానుజన్‌ రాసిన మ్యాజిక్‌ స్క్వేర్, ప్యూర్‌ మాథ్స్‌కు చెందిన నెంబర్‌ థియరీ, మాక్‌ తీటా ఫంక్షన్స్‌ చాలా ప్రసిద్ధి పొందాయి. వీటిని ఆధారంగా చేసుకుని కనుగొన్న స్వింగ్‌ థియరీ, క్యాన్సర్‌పై పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని 1986–87 రామానుజన్‌ శతజయంత్యుత్సవాల్లో గణిత శాస్త్రవేత్తలు ప్రకటించారు. హార్డీ స్కేలుపై వందకు వంద పాయింట్లు పొందిన ఏకైక గణిత శాస్త్రవేత్త రామానుజనే. ఆయన తర్వాత ఆ లోటును మరో శాస్త్రవేత్త భర్తీ చేయలేకపోడం విచారకరం.

– ఎమ్‌.రామ్‌ప్రదీప్, తిరువూరు (నేడు ఎస్‌. రామానుజన్‌ వర్ధంతి) 
 

మరిన్ని వార్తలు