రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ.. శాంతిభద్రతల అంశం

19 Jan, 2021 04:04 IST|Sakshi

అనుమతిపై నిర్ణయం ఢిల్లీ పోలీసులదే: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 26న ఢిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ శాంతిభద్రతకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఢిల్లీలోకి ఎవరిని అనుమతించా లన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది ఢిల్లీ పోలీసులేనంది. 26న ట్రాక్టర్‌ ర్యాలీ లేదా ఇతర నిరసన ప్రదర్శనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన విజ్ఞాపనపై సుప్రీంకోర్టు సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. ట్రాక్టర్‌ ర్యాలీకి అనుమతి ఇచ్చే లేదా నిరాకరించే విషయంలో పోలీసులకు పూర్తి అధికారం ఉందని పేర్కొంది. ‘‘పోలీసుల అధికారాలను సుప్రీంకోర్టు గుర్తుచేయాలా? వాటిని ఎలా ఉపయోగించాలో న్యాయస్థానం చెప్పాలా? ఏం చేయాలో మేము మీకు చెప్పబోవడం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కేంద్ర సర్కారు విజ్ఞాపనపై తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి(బుధవారం) వాయిదా వేసింది.  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ రైతులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. శాంతియుతంగా ఈ ర్యాలీ నిర్వహిస్తామని, వేలాది మంది రైతన్నలు పాలుపంచుకుంటారని తెలిపారు. రైతులు రాజ్‌పథ్‌లో ర్యాలీ చేయబోరని చెప్పారు.

పదో దఫా చర్చలు రేపటికి వాయిదా
సాగు చట్టాలపై రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య మంగళవారం జరగాల్సిన పదో దఫా చర్చలు బుధవారానికి వాయిదా పడ్డాయి. ఈ చర్చలు 19వ తేదీకి బదులుగా 20వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రైతుల తరపున 41న రైతు సంఘాల నాయకులు ఈ చర్చలకు హాజరు కానున్నారు.

ఇతర సిద్ధాంతాలున్న వ్యక్తుల వల్లే జాప్యం
చట్టాలపై ప్రతిష్టంభన తొలగిపోవాలని   కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పరిషోత్తం రూపాల చెప్పారు. అయితే, ఇతర సిద్ధాంతాలున్న కొందరు వ్యక్తుల వల్లే జాప్యం జరుగుతోందని విమర్శించారు. రైతు సంఘాల నాయకులు కాకుండా రైతులే నేరుగా తమతో చర్చిస్తే సమస్య ఎప్పుడో పరిష్కారమయ్యేది స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు