ఫిరోజాబాద్‌లో డెంగ్యూ మహమ్మారి

5 Sep, 2021 06:09 IST|Sakshi

నిర్ధారించిన కేంద్ర నిపుణుల బృందం

సోమవారం కేంద్రానికి నివేదిక సమర్పించే అవకాశం

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో డెంగ్యూ మహమ్మారి చెలరేగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన నిపుణులు బృందం నిర్ధారించింది. ఫిరోజాబాద్‌ పరిసర ప్రాంతాల్లో 200 శాంపిళ్లు సేకరించి పరీక్షించగా వాటిలో 50 శాతం మందికి డెంగ్యూ పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ ప్రాంతంలో గత 10 రోజుల్లో 60 మందికి పైగా డెంగ్యూ కారణంగా మరణించగా, అందులో 50 మంది చిన్నారులు ఉన్నారు. చిన్నారులకు ప్రమాదకరమైన హీమరాజిక్‌ ఫీవర్‌ వస్తున్నట్లు నిపుణులు గుర్తించారు.

హీమరాజిక్‌ డెంగ్యూ ఫీవర్‌లో ప్లేట్‌లెట్‌ల సంఖ్య ఉన్నట్టుండి పడిపోతుంది. దీంతో పాటు రక్తస్రావం కూడా అవుతుంది. దీంతో చిన్నారులు తక్కువ సమయంలోనే మరణిస్తున్నట్లు నిపుణులు బృందం తెలిపింది. యూపీలో చిన్నారులకు వ్యాపిస్తున్న జ్వరాలు హీమరాజిక్‌ డెంగ్యూ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు తెలిపినట్లు ఫిరోజాబాద్‌ కలెక్టర్‌ ఇటీవలే వెల్లడించారు. జనావాసాల పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే వెంటనే వాటిని శుభ్రం చేయాలని తాజాగా ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆరుగురు సభ్యులతో కూడిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) బృందం ఫిరోజాబాద్‌ పరిసర ప్రాంతాల్లో పర్యటించింది.

ఈ బృందంలో ఎంటొమాలజిస్టులు సహా పలు వెక్టర్‌–బోర్న్‌ వ్యాధుల నిపుణుల ఉన్నారు. వారు పరిశీలించిన అంశాలను కేంద్రానికి సోమవారం నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఎన్‌సీడీసీకి చెందిన తుషార్‌ ఎన్‌ నేల్‌ ఆధ్వర్యంలోని బృందం తమ ప్రాంతాన్ని పర్యటించి పరిస్థితులను పరిశీలించినట్లు ఫిరోజాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ అలోక్‌ కుమార్‌ శర్మ చెప్పారు. కేవలం ఫిరోజాబాద్‌లో మాత్రమేగాక మథుర, ఆగ్రా వంటి చోట్ల కూడా డెంగ్యూ ప్రబలుతోంది. మథురలో కేవలం 15 రోజుల్లోనే 11 మంది చిన్నారులు కన్నుమూశారు. కోవిడ్‌ అనంతర పరిస్థితుల నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏ మాత్రం నేర్చుకోలేదని, ఇప్పటికే వైరల్‌ ఫీవర్‌ కారణంగా 100 మందికి పైగా మరణించారంటూ కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ప్రభుత్వాన్ని విమర్శించారు.

మరిన్ని వార్తలు