కట్నంతో లాభాలెన్నో!

5 Apr, 2022 05:18 IST|Sakshi

వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రచురితమైన బీఎస్సీ నర్సింగ్‌ రెండో ఏడాది పుస్తకం

ముంబై: వరకట్నంతో చాలా ప్రయోజనాలున్నాయంటూ పలు ఉదాహరణలను పేర్కొన్న బీఎస్సీ నర్సింగ్‌ రెండో ఏడాది పాఠ్యపుస్తకం ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది. టీకే ఇంద్రాణి రచించిన సోషియాలజీ ఫర్‌ నర్సింగ్‌ పుస్తకంలోని ఒక పేరాలో పేర్కొన్న అంశాలను నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఆ పేజీ ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ ఇంట్లోకి కొత్త కుటుంబసభ్యురాలిగా అడుగుపెట్టేందుకు వరకట్నం ఎంతగానో సాయపడుతుంది. ఇంట్లోకి సమస్త సామగ్రి, వాహనాలు ఇలా అన్నీ కట్నం రూపంలో వచ్చిపడతాయి. అమ్మాయి తన తల్లిదండ్రుల ఆస్తిలో భాగాన్ని ఇలా కట్నంరూపంలో అత్తవారింటికి తెచ్చుకోవచ్చు.

కట్నాలు ఇచ్చే స్తోమత లేకే కొందరు తల్లిదండ్రులు అమ్మాయిలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. వారు చదివి, ఉద్యోగం సంపాదిస్తే కట్నం డిమాండ్‌ తగ్గుతుంది. ఇదొక మంచి ప్రయోజనం. అందవిహీన అమ్మాయిలకు మంచి/అందవిహీన అబ్బాయిలతో పెళ్లి అవ్వాలంటే కట్నం ముట్టజెప్పాల్సిందే’ అంటూ పలు వ్యాఖ్యానాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. ఇలాంటి పాఠ్యపుస్తకాలు ఉండటం మన భారతజాతికే సిగ్గుచేటు’ అంటూ శివసేన మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఆగ్రహం వ్యక్తంచేశారు. పాఠ్య ప్రణాళిక నుంచి వెంటనే ఈ పుస్తకాన్ని తొలగించి, సంబంధికులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆమె లేఖ రాశారు.  
 

మరిన్ని వార్తలు