బైక్‌, వ్యాన్‌ కాదు గుర్రంపై డెలివరీ.. కారణం ఇదేనట!

16 Jan, 2021 19:30 IST|Sakshi

సాధారణంగా ఈ కామర్స్‌ నుంచి వచ్చే డెలివరీలు బైక్‌లపై తీసుకొచ్చి కస్టమర్లకు అందిస్తారు ఏజెంట్లు. ఒక వేళ ఆన్‌లైన్‌లో బుక్‌ చేసిన వస్తువు పెద్దదైతే వ్యాన్‌లో తీసుకొస్తారు. ఇది అందరు ఏజెంట్లు చేసే పనే. అయితే తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని భావించిన ఓ కశ్మిర్‌ ఏజెంట్‌ మాత్రం వెరైటీగా ఆర్డర్లు డెలివరీ చేసి అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేశాడు. బైక్‌, వ్యాన్‌ కాకుండా గుర్రంపై వెళ్లి పార్సిల్‌ అందజేశాడు.

శీతాకాలం కారణంగా జమ్ముకశ్మీర్‌లో మంచు విపరీతంగా కురుస్తుంది. రహదాలన్నీ మంచుతో కప్పబడిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  దీంతో కస్టమర్లకు సమయానికి పార్సిల్‌ని అందించాలని భావించిన ఓ  అమేజాన్‌ ఏజెంట్‌కు ఓ చక్కటి ఉపాయం వచ్చింది. రహదారులపై వాహనాలు నడిచేందుకు ఇబ్బందిగా ఉండడంతో గుర్రంపై స్వారీ చేస్తూ... కస్టమర్లకు ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాడు. ఫొటో జర్నలిస్ట్‌ ఉమర్ గనీ ఈ వీడియోను తన సామాజిక ఖాతాలో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయ్యింది. అమేజాన్‌ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ తెలివిని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. కాగా, తనకు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టమని అందుకే ఇలా గుర్రంపై వెళ్లి ఆర్డర్లు డెలివరీ చేస్తున్నానని సదరు ఏజెంట్‌  చెబుతున్నాడు. అలాగే కొందరు అత్యవసరాల కోసం ఆర్డర్లు చేస్తారని, వారికి ఇబ్బంది కలగకుండా ఈ మార్గంలో వెళ్లి సమయానికి వారికి ఆర్డర్లను అందిస్తున్నానని చెప్పారు.

మరిన్ని వార్తలు