15 రోజులుగా నీళ్లే ఆహారం.. చివరికి ఆసుపత్రి పాలయ్యారు

20 Jun, 2021 10:48 IST|Sakshi
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

అలీఘర్‌ : కరోనా వైరస్‌ మహమ్మారి పేదల జీవితాలను అల్లకల్లోలం చేసింది. చాలా మందిని ఉపాధికి దూరం చేసి, తినడానికి మెతుకు కూడా లేని స్థితికి తీసుకువచ్చింది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో వందల సంఖ్యలో ఆకలి చావులు నమోదయ్యాయి. దేశంలోని ఏదో ఓ మూల ఆకలి చావులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌ జిల్లాలో చుట్టూ ప్రాణమున్న మనుషులున్నా.. ఆదుకునే వారు లేక ఓ కుటుంబం ఆకలితో అలమటించింది. కొన్ని రోజులుగా తినడానికి తిండిలేక ఆసుపత్రి పాలైంది.  వివరాలు.. అలీఘర్‌ జిల్లా, మందిర్‌ కా నగ్లా గ్రామానికి చెందిన విజయేంద్ర కుమార్‌ ఫస్ట్‌ వేవ్‌లో కరోనాతో మరణించాడు. విజయేంద్ర కుమార్‌ మరణం తర్వాత అతడి భార్య గుడ్డీ దేవి ఓ ఎక్స్‌పోర్ట్‌ కంపెనీలో ప్యాకేజింగ్‌ సెక్షన్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేది. కోవిడ్‌ 19 కారణంగా ఆ ఉద్యోగం కూడా పోయింది. ఈ నేపథ్యంలో పెద్ద కుమారుడు అజయ్‌ కూలీ పనికి వెళ్లి డబ్బులు తెచ్చేవాడు. అయితే, లాక్‌డౌన్‌ మరింత కఠినతరం చేయటంతో ఆ కూలీ పని కూడా పోయింది. దీంతో కుటుంబం పూట గడవక ఇబ్బందిపడేది.

ఇది చూసిన పొరిగింటి వాళ్లు తినడానికి సహాయం చేసేవారు. దాదాపు 15 రోజులనుంచి వాళ్లు కూడా తిండి పెట్టడం మానేశారు. రేషన్‌ షాపు డీలర్‌ను, ఊరి పెద్దను తిండి పెట్టమని అడిగ్గా వారు కుదరదన్నారు. ఇక అప్పటినుంచి తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు. నీళ్లు తాగి కడుపునింపుకుంటున్నారు. మంగళవారం ఈ కుటుంబం గురించిన సమాచారం అందుకున్న ఓ ఎన్జీఓ సంస్థ కార్యకర్త చావుకు దగ్గరలో ఉన్న వారిని ఆసుపత్రిలో చేర్పించాడు. వారికి ఆధార్ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలు లేకపోవటంతో ప్రభుత్వ సహాయం అందలేదని సదరు ఎన్జీఓ కార్యకర్త తెలిపాడు. దీనిపై స్పందించిన ఉన్నత అధికారులు వారికి అన్ని రకాలుగా సహాయం చేయటానికి ముందుకు వచ్చారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు