భారత్‌కు 5 రఫేల్ యుద్ధ విమానాలు

27 Jul, 2020 12:14 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రఫేల్‌ యుద్ద విమానాలు జూలై 29న భారత్‌ చేరనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఫ్రాన్స్‌ నుంచి రఫేల్‌ యుద్ధ విమానాలు బయలుదేరినట్లు ఫ్రాన్స్‌లోని ఇండియన్‌ ఎంబసీ అధికారులు తెలిపారు. ఐదు రఫేల్‌ యుద్ధ విమానాలు ఎల్లుండి భారత్‌లోని అంబాలా వైమానికి స్థావరానికి చేరనున్నాయి. భారత దేశానికి బయలుదేరే ముందు యూఏఈలోని ఎయిర్‌బేస్‌లో ఫ్రాన్స్‌ వైమానికి దళానికి చెందిన ట్యాంకర్‌ విమానం ద్వారా ఇంధనం నింపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇక భారత్‌ 36 రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో 2016 సెప్టెంబరులో రూ.58,000 కోట్లతో ఒక ఒప్పందం చేసుకోవడం తెల్సిందే. కోవిడ్‌ నేపథ్యంలో వీటి సరఫరా ప్రశ్నార్థకమైన నేపథ్యంలో ఈ నెల రెండవ తేదీన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లేతో ఫోన్‌లో మాట్లాడారు. సకాలంలో యుద్ధ విమానాలను సరఫరా చేస్తామని రాజ్‌నాథ్‌కు పార్లే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో రఫేల్‌ యుద్ధ విమానాల రాక వాయుసేన నైతిక స్థైర్యాన్ని పెంచనుంది.

మరిన్ని వార్తలు