G20 Summit: సరిహద్దుల్లో భారీ సైనిక విన్యాసాలు

5 Sep, 2023 06:31 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనా, పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) త్రిశూల్‌ పేరిట భారీ సైనిక విన్యాసాలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 4 నుంచి 14వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. త్రిశూల్‌లో భాగంగా రఫేల్‌ వంటి యుద్ధ విమానాలను, ఎస్‌–400, ఎంఆర్‌సామ్, స్పైడర్‌ వంటి గగనతల రక్షణ వ్యవస్థలను ఎయిర్‌ఫోర్స్‌ రంగంలోకి దించనుంది. దీంతోపాటు, లద్దాఖ్‌లో ఆర్మీ విభాగాలు వేరుగా విన్యాసాలు చేపడతాయి.

దేశ ఉత్తర సరిహద్దులతోపాటు ఢిల్లీలో, ఢిల్లీ వెలుపల ఐఏఎఫ్‌ పలు రక్షణ వ్యవస్థలను మోహరించనుంది. జీ20 సదస్సుకు సమగ్ర గగనతల రక్షణను కల్పించడమే త్రిశూల్‌ ఉద్దేశమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.  అదేవిధంగా, లద్దాఖ్‌లో ఆర్మీ విభాగాలు ప్రత్యేక విన్యాసాలు నిర్వహిస్తాయి. పారా ట్రూపర్లు, పర్వత ప్రాంత యుద్ధ విద్యలో ఆరితేరిన విభాగాలు సైతం ఇందులో పాల్గొంటాయి. త్వరలో జరిగే జీ20 శిఖరాగ్రానికి 20 మందికి పైగా ప్రపంచ దేశాల నేతలు రానున్న దృష్ట్యా దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్న వేళ ఈ విన్యాసాలు జరుగుతుండటం గమనార్హం.

మరిన్ని వార్తలు