ఆధార్‌ కార్డు థీమ్‌తో వినాయకుడి మండపం.. సెల్ఫీలతో భక్తులు ఖుష్‌!

1 Sep, 2022 17:46 IST|Sakshi

రాంచీ: ‍ప్రజల జీవితంలో ఆధార్‌ కార్డు ఒక భాగమైపోయింది. ఏ పని చేయాలన్నా ఆధార్‌ తప్పనిసరిగా మారిపోయింది. అయితే.. ఒక్క మనుషులకేనా? దేవుళ్లకు కూడా ఆధార్‌ ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు జార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్‌కు చెందిన కొందరు యువకులు.. అందుకు వినాయక చవితి ఉత్సవాలను వేదికగా చేసుకున్నారు. గణేషుడి పేరుపై ఆధార్‌ కార్డు సృష్టించేశారు. ఆధార్‌ నమూనాతో భారీ ఎత్తున ఆధార్‌ కార్డు మండపం వేశారు. ఆధార్‌ కార్డ్‌ థీమ్‌తో వేసిన ఈ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  అక్కడికి వచ్చి పోయే భక్తులు ఆసక్తితో ఆధార్‌ కార్డులోని వివరాలను చదువుతూ, సెల్ఫీలు దిగుతూ ముచ్చట పడుతున్నారు. 

ఆధార్‌ కార్డు ప్రకారం.. వినాయకుడి అడ్రస్‌ కైలాసంగా పేర్కొన్నారు. ఫోటో స్థానంలోనే గణేషుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. ఆధార్‌ కార్డుపై ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్‌ చేస్తే.. అది గూగుల్‌ లింక్‌కు వెళ్తుంది. అందులో వినాయకుడికి సంబంధించిన ఫోటోలు ప్రత్యక్షమవుతాయి. ఆ వినూత్న ఆధార్‌పై శ్రీ గ‌ణేశ్ S/o మ‌హాదేవ్‌, కైలాస్ ప‌ర‍్వత శిఖరం, మాన‌స స‌రోవ‌రం స‌ర‌స్సు ద‌గ్గర, పిన్‌కోడ్ 000001 అని రాసి ఉంది. ఇక డేట్ ఆఫ్‌ బ‌ర్త్ 01/01/600CEగా పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: విదేశాల్లో వినాయకుడు.. గణేషునికి దేశదేశాల్లో ప్రత్యేక స్థానం

మరిన్ని వార్తలు