ఆర్మీ కొత్త చీఫ్‌ మనోజ్‌ పాండే

1 May, 2022 05:59 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ 29వ ఆర్మీ చీఫ్‌గా జనరల్‌ మనోజ్‌ పాండే(60) బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే శనివారం రిటైర్‌ కావడంతో ఆయన స్థానంలో జనరల్‌ పాండే బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆర్మీ వైస్‌ చీఫ్‌గా ఉన్న జనరల్‌ పాండే, కార్ప్స్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎంపికైన మొదటి వ్యక్తి. చైనా, పాకిస్తాన్‌ సరిహద్దు ఉద్రిక్తతలు సహా దేశం భద్రతాపరమైన అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ జనరల్‌ పాండే చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా పగ్గాలు చేపట్టడం గమనార్హం. ప్రస్తుతం ఆయన కీలకమైన చైనాతో సరిహద్దు ఉన్న ఈస్టర్న్‌ ఆర్మీ కమాండ్‌కు నేతృత్వం వహిస్తున్నారు.

ఆర్మీ చీఫ్‌గాను, నావిక, వైమానిక దళాలతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా థియేటర్‌ కమాండ్స్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. దేశ మొట్టమొదటి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ థియేటర్‌ కమాండ్స్‌ బాధ్యతలు నిర్వహించేవారు. ఆయన హెలికాప్టర్‌ దుర్ఘటనలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో ప్రభుత్వం మరొకరిని నియమించాల్సి ఉంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన పాండే.. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో శిక్షణ అనంతరం 1982లో కార్ప్స్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌లో చేరారు. సుదీర్ఘ కెరీర్‌లో పలు కీలక బాధ్యతలు చేపట్టిన ఆయనకు చైనా సరిహద్దులు, జమ్మూకశ్మీర్‌ సహా అన్ని రకాల ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం ఉంది. దేశంలో ఏకైక త్రివిధ దళాల కమాండ్‌ ఉన్న అండమాన్‌ నికోబార్‌ కమాండ్‌కు చీఫ్‌గా కూడా వ్యవహరించారు.

మరిన్ని వార్తలు