పేదల ఆకలి తీరుస్తున్న గంభీర్‌ 'జాన్‌ రసోయి'‌

9 Feb, 2021 16:18 IST|Sakshi

ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్‌.. బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ 'జాన్‌ రసోయి' పేరిట క్యాంటీన్‌ ప్రారంభించి ఒక్క రూపాయికే నాణ్యమైన భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో గాంధీనగర్‌లో జాన్‌ రసోయి క్యాంటీన్‌ను లాంచ్‌ చేయగా.. తాజాగా మంగళవారం గంభీర్‌ తన లోక్‌సభ పరిధిలోని అశోక్‌ నగర్‌లో రెండో క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఢిల్లీ బీజేపీ చీఫ్‌ ఆదేశ్‌ గుప్తా ఆధ్వర్యంలో గంభీర్‌ దీనిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా గంభీర్‌ మాట్లాడుతూ.. కులం, మతం, లేదా ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారం తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. నిరాశ్రయులకు రోజుకు రెండు పూటలా భోజనం లభించకపోవడం బాధగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జన్‌ రసోయి క్యాంటీన్లకు ప్రాణం పోశాం. గాంధీనగర్‌లో ప్రారంభించిన జన్‌ రసోయి మొదటి క్యాంటీన్‌లో రోజుకు వెయ్యి మంది చొప్పున ఆకలి తీరుస్తుంది. కాగా ఇప్పటివరకు 50వేల మందికి పైగా పేద ప్రజలు జన్‌ రసోయి క్యాంటీన్‌లో నాణ్యమైన ఆహారాన్ని పొందడం గొప్ప విజయంగా భావిస్తున్నాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేదలకు నాణ్యమైన ఆహారం అందిస్తామంటూ కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. ఈ విషయంలో ఆందోళన నిర్వహించొచ్చు.. పేదల ఆకలి తీర్చే విషయంలో రాజకీయం చేయకూడదనే జాన్‌ రసోయి క్యాంటీన్లకు శంకుస్థాపన చేశాం.అంటూ తెలిపాడు.

కేవలం రూపాయికే భోజనం అందిస్తున్న జాన్‌ రసోయి క్యాంటీన్‌లో భోజనంలోకి బియ్యం, కాయధాన్యాలు, కూరగాయలు ఇవ్వనున్నారు. కాగా ఈ క్యాంటీన్లలో ఒకేసారి వంద మంది కూర్చునే సామర్ధ్యం ఉండడం విశేషం. ఈ ప్రాజెక్టుకు గౌతమ్ గంభీర్ ఫౌండేషన్‌తోపాటు తన వ్యక్తిగత వనరుల నుంచి నిధులు సమకూరుస్తున్నారు.

మరిన్ని వార్తలు