కుక్కలకు ఆస్పత్రిలో వెంటిలేటర్‌ సౌకర్యం.. ఎక్కడంటే..

23 Nov, 2021 20:25 IST|Sakshi

గాంధీనగర్‌: సాధారణంగా శునకాన్ని విశ్వాసానికి గుర్తుగా భావిస్తారు. యజమానులు కుక్కని తమ కుటుంబ సభ్యుల్లో ఒకదానిలా చూసుకుంటారు. ఒకవేళ తమ పెంపుడు కుక్కకు ఏమైనా జరిగితే యజమానులు విలవిల్లాడిపోతారు. కుక్కలు కూడా తమ యజమానిపట్ల అదే విధంగా ప్రేమను, విశ్వాసాన్ని కనబరుస్తుంటాయి. ఇక్కడ ఒక యజమాని.. తన పెంపుడు కుక్క పట్ల తన ప్రేమను గొప్పగా చాటుకున్నాడు.

వివరాలు.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరానికి చెందిన శైవల్‌ దేశాయ్‌ అనే వ్యక్తి ఒక కుక్కను పెంచుకున్నాడు. అది ఏడాది క్రితం అనారోగ్యంతో  చనిపోయింది. దీంతో.. శైవల్‌ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. తన కుక్కకు సరైన వైద్యం దొరికితే.. బతికేదని భావించాడు. ఈ క్రమంలో తన మిత్రులతో కలిసి ఒక కొత్త ఆలోచన చేశాడు.

మనిషి మాదిరిగానే కుక్కలకు కూడా వెటర్నరీ ఆస్పత్రిలో అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఆ తర్వాత.. అతను కొన్నిరోజులకు అహ్మదాబాద్‌లో.. వెటర్నరీ బెస్ట్‌ బడ్స్‌ పెట్‌ పేరుతో ఆస్పత్రిని ప్రారంభించాడు. దీనిలో అన్నిరకాల సదుపాయాలతోపాటు.. వెంటిలేటర్‌ కూడా ఏర్పాటు చేశాడు. భారత్‌లో మూగజీవాలకు వెంటిలేటర్‌ సౌకర్యం ఉన్న తొలి ఆస్పత్రిగా ఇది రికార్డులకెక్కింది.

ఈ ఆస్పత్రిలో మూగజీవాలన్నింటికి ఉచితంగా వైద్యం అందిస్తారని శైవల్‌ దేశాయ్‌ తెలిపారు. ఈ ఆస్పత్రి సీనియర్‌ వైద్యుడిగా దివ్వ్యేష్‌ కేలవాయ పనిచేస్తున్నారు. కొంత మంది కుక్కల నుంచి కరోనా సోకుతుందని పుకార్లు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిలో ఎలాంటి నిజంలేదని తెలిపారు. 

మరిన్ని వార్తలు