ఐదు దశాబ్దాల తర్వాత డిగ్రీ పట్టా అందుకున్న సీఎం.. కారణం ఏంటో తెలుసా?

4 Mar, 2023 16:51 IST|Sakshi

సాధారణంగా డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు పట్టాను అందుకుంటారు. ఇది మూమూలు విషయమే కానీ అదే పట్టాను డిగ్రీ పూర్తి చేసిన 50 ఏళ్ల తర్వాత అందుకుని వార్తల్లో నిలిచారు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి. అయితే ఇన్నేళ్ల తర్వాత ఆయన డిగ్రీ పట్టాను అందుకోవడం వెనుక ఓ కారణం కూడా ఉందంటున్నారు హరియాణా సీఎం మనోహర్​ లాల్​ ఖట్టర్. ఆయన తన గ్రాడ్యుయేషన్‌ ఢిల్లీ యూనివర్శిటిలో ఐదు దశాబ్దాల క్రితమే (1972) పూర్తి చేశారు.

అయితే ఇటీవలే ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ నుంచి డిగ్రీ పట్టాను అందుకున్నారు ఖట్టర్‌. దీనిపై ఆయన మాట్లాడుతూ.. "నేను మఖ్యమంత్రి అయిన తర్వాత నా ప్రాథమిక పాఠశాల, హైస్కూల్​, రోహ్​తక్​లో ఉన్న కాలేజీకి వేళ్లాను. కానీ ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లడం మాత్రం కుదరలేదు. అందుకే ఇన్నేళ్లుగా పట్టాను తీసుకోలేకపోయాను. ఈ యూనివర్శిటీతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది, ఇక్కడి నుంచే దేశానికి సేవ చేయాలని స్ఫూర్తి పొందాను" అని సీఎం వెల్లడించారు.

అనంతరం విద్యార్థులకు సందేశం ఇస్తూ.. బాల్యంలోనే విద్యార్థులు సరైన దిశను ఎంచుకోవాలని.. భవిష్యత్​లో ఇబ్బందుల పాలు కాకుండా చూసుకోవాలని సూచించారు. యువత లక్ష్యాలు చిన్నవిగా కాకుండా పెద్దవిగా ఉండాలని, తద్వారా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. ఆయుధాలను ఎలా తయారు చేయాలో సైన్స్ నేర్పుతుందని, అయితే వాటిని తెలివిగా ఉపయోగించకపోతే వినాశనానికి కారణమవుతుందని కూడా ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ కల్చరల్ కౌన్సిల్ చైర్‌పర్సన్, పీఆర్‌ఓ అనూప్ లాథర్ రచించిన “కాల్ ఔర్ తాల్” పుస్తకాన్ని సీఎంకు అందజేశారు. ఈ పుస్తకంలో హర్యాన్వి జానపద సంస్కృతికి సంబంధించిన 150 పాటలు ఉన్నాయి.

చదవండి: ఐటీ జాబ్‌ కూడా తక్కువే!.. ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

మరిన్ని వార్తలు