‘ఎవరికీ భయపడం.. న్యాయం తప్ప ఇంకేమీ వద్దు’

8 Oct, 2020 16:20 IST|Sakshi

మమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం

కట్టుకథలు అల్లుతున్నారు

మా ఇంట్లో ఒకే ఫోన్‌ ఉంది

ఆడియో రికార్డులు ఉంటే బయటపెట్టండి

లక్నో: ‘‘ఇప్పటికే మా కూతురిని కోల్పోయాం. ఇప్పుడేమో మమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా మేం ఎవరికీ భయపడం. ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలే. మాకు ఎటువంటి నష్టపరిహారం గానీ, డబ్బు గానీ వద్దు. కేవలం న్యాయం మాత్రమే కావాలి. అంతకుమించి ఇంకేమీ ఆశించడం లేదు’’అంటూ హథ్రాస్‌ సామూహిక అత్యాచారం, హత్య ఘటన బాధితురాలి తండ్రి జాతీయ మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన తన కూతురిపై నిందలు వేయవద్దని, తమ కుటుంబం గురించి అసత్యాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో 19 ఏళ్ల దళిత యువతి హత్యోదంతం కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు సందీప్‌ ఠాకూర్‌ బాధితురాలి తల్లి, సోదరులపై తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం విదితమే. (చదవండి: మా స్నేహం నచ్చక వాళ్లే చంపేశారు: సందీప్‌ ఠాకూర్‌)

ఈ కేసులో తనతో పాటు జైలులో ఉన్న మరో ముగ్గురు నిందితులతో కలిసి హథ్రాస్‌ ఎస్పీకి లేఖ రాసిన అతడు.. యువతి కుటుంబ సభ్యులే ఆమెను తీవ్రంగా కొట్టి మృతికి కారణమయ్యారని ఆరోపించాడు. బాధితురాలు తనతో స్నేహం చేయడం నచ్చకే, ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, తాము అమాయకులమని లేఖలో రాసుకొచ్చాడు. అదే విధంగా భూల్గరీ గ్రామ పెద్ద సైతం ఇదే తరహా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై స్పందించిన బాధితురాలి తండ్రి.. దయచేసి తమ కుటుంబం గురించి వదంతులు వ్యాప్తి చేయవద్దంటూ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు.

కట్టుకథలు అల్లుతున్నారు..: ప్రియాంక గాంధీ
హథ్రాస్‌ బాధితురాలిపై వస్తున్న ఆరోపణలను కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్రంగా ఖండించారు. ‘‘కట్టుకథలు అల్లి ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేవిధంగా వ్యవహరిస్తున్నారు. నేరం చేసినవాళ్లకు మద్దతు పలుకుతూ బాధితురాలినే ఘటనకు బాధ్యురాలిని చేయడం అమానుషం’’అంటూ ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మహిళకు కావాల్సింది న్యాయమని, ఆమెపై నిందలు వేయడం సరకాదంటూ హితవు పలికారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 

ఆడియో రికార్డులు బయటపెట్టండి
ఇక ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును విచారిస్తోంది. ఘటనపై లోతుగా విచారణ చేపట్టిన సిట్‌, బాధితురాలి సోదరుడు, ప్రధాన నిందితుడికి మధ్య ఫోన్‌ సంభాషణ జరిగినట్లు కాల్‌డేటా లభించిందన్న వార్తల నేపథ్యంలో, ముగ్గురు సభ్యుల బృందం అతడిని ప్రశ్నించింది. ఈ విషయంపై స్పందించిన బాధితురాలి సోదరుడు.. ‘‘వాళ్లతో మాకు కాంటక్ట్‌ లేదు. మా ఇంట్లో ఒకే ఒక్క ఫోన్‌ ఉంది. ఒకవేళ నిజంగానే పోలీసుల దగ్గర ఆడియో కాల్స్‌ రికార్డింగ్‌ ఉంటే వాటిని బయటపెట్టాలి’’అని డిమాండ్‌ చేశాడు. కాగా ఆది నుంచి ఈ కేసులో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు