Cyclone Yass: ‘యాస్‌’ విధ్వంసం

27 May, 2021 05:05 IST|Sakshi
తుపాను కారణంగా కురిసిన భారీ వర్షం కారణంగా కోల్‌కతాలో జలమయమైన ఓ రహదారి

ఒడిశా, బెంగాల్‌ల్లో ఈదురుగాలులు, భారీ వర్షాలు

నీట మునిగిన తీర ప్రాంతాలు

సురక్షిత ప్రాంతాలకు 20 లక్షల మంది ప్రజలు

ఐదుగురి మృతి

బాలాసోర్‌/కోల్‌కతా: అత్యంత తీవ్ర తుపాను ‘యాస్‌’ ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో పెను విధ్వంసం సృష్టించింది. పెను గాలులు, భారీ వర్షాలతో రెండు రాష్ట్రాల్లోని తీర ప్రాంత జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్, టెలికం సేవలకు అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున ఇళ్లు, చెట్లు కూలిపోయాయి. పళ్ల తోటలు, పంటపొలాలు నాశనమయ్యాయి. దాదాపు 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను కారణంగా ఒడిశాలో నలుగురు, బెంగాల్‌లో ఒకరు చనిపోయారు. భీకర ఈదురుగాలులు, భారీ వర్షాలను తీసుకువస్తూ బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఒడిశాలోని ధమ్ర పోర్ట్‌ సమీపంలో తుపాను తీరం దాటింది. మధ్యాహ్నానికి బలహీనపడి జార్ఖండ్‌ దిశగా వెళ్లింది. ఒడిశాలోని బాలాసోర్, భద్రక్‌ జిల్లాల్లో పలు తీర ప్రాంత గ్రామాల్లోకి సముద్ర నీరు చొచ్చుకువచ్చింది. ఆయా ప్రాంతాల్లో  స్థానికుల సహకారంతో సహాయ చర్యలు చేపట్టామని ఒడిశా స్పెషల్‌ రిలీఫ్‌ కమిషనర్‌ పీకే జెనా తెలిపారు. రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో చెట్లు కూలి ఇద్దరు, ఇల్లు కూలి ఒక వృద్ధురాలు చనిపోయారు. తీరప్రాంతాల నుంచి 5.8 లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించారు.  

పశ్చిమబెంగాల్‌లో..
తమ రాష్ట్రంలో దాదాపు కోటి మందిపై ఈ తుపాను ప్రభావం చూపిందని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. 15 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. 3 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు రూ. 10 కోట్ల విలువైన సహాయసామగ్రిని పంపిణీ చేశామన్నారు. తూర్పు మిడ్నాపూర్‌ జిల్లాలోని దిఘాపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. శంకర్‌పుర్, మందర్‌మని, తేజ్పూర్‌ల్లోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. సముద్ర తీరాల్లో అలలు అల్లకల్లోలం సృష్టించాయి. కొన్నిచోట్ల కొబ్బరి చెట్ల ఎత్తులో కెరటాలు విరుచుకుపడ్డాయి. శంకరపుర్‌లోని తీర ప్రాంతంలో ఉన్న ఒక పాఠశాల అలల ధాటికి కొట్టుకుపోయింది. పౌర్ణమి కావడంతో అలల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. హూగ్లీ నది పోటెత్తడంతో కోల్‌కతా పోర్ట్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీస్, వాలంటీర్లు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. రానున్న 24 గంటల పాటు తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షపాతం, దక్షిణ 24 పరగణ, బంకుర, ఝార్గం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ బుధవారం హెచ్చరించింది.

ఒడిశాలో..
యాస్‌ ప్రభావంతో ఒడిశాలో, ముఖ్యంగా భద్రక్, బాలాసోర్‌ జిల్లాల్లో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని స్థానికులు తెలిపారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షపాతం నమోదవుతుందని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ రెడ్‌ వార్నింగ్‌ నోటీస్‌ జారీ చేసింది.

మరిన్ని వార్తలు