అందరి కృషితో లక్ష్యాలు అందుకోగలం

16 Aug, 2021 03:53 IST|Sakshi
ఎర్రకోట బురుజులపై నుంచి ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

నేటి యువతరం ఏదైనా సాధిస్తుంది 

దేశ శతాబ్ది ఉత్సవాల నాటికి ఆత్మనిర్భర్‌ భారత్‌ కల సాకారం

75వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రధాని మోదీ

ఎర్రకోట వేదికగా రూ. 100 లక్షల కోట్లతో గతిశక్తి పథకం 

వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధికి జాతీయ ప్రణాళిక రూపకల్పన  

న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్రదిన శతాబ్ది వేడుకల సమయానికి భారత్‌ను ఒక ప్రబల శక్తిగా తీర్చిదిద్దాలని, దీనికి ప్రజలు చేసే కృషి అత్యంత కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాల గురించి ప్రస్తవిస్తూ.  ప్రపంచ స్థాయి సదుపాయాల కల్పనకు మార్గదర్శకాలను సూచిస్తూ, కొత్త అభివృద్ధి పథకాలను ప్రకటిస్తూ మధ్య మధ్యలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి సగర్వంగా చాటుతూ ప్రధాని ప్రసంగం సాగింది.    75వ స్వాతంత్య్ర దిన అమృతోత్సవ వేడుకల   సందర్భంగా ఆదివారం ప్రధాని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు.

ఎర్రకోట వేదికగా వరసగా ఎనిమిదోసారి ప్రసంగించిన ప్రధాని మోదీ దేశంలో మౌలిక సదుపాయాల పెంపు, ఉద్యోగాల కల్పన కోసం రూ.100 లక్షల కోట్లతో గతి శక్తి అనే భారీ పథకాన్ని ప్రకటించారు. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను అత్యంత సాహసోపేతంగా ఎదుర్కొంటున్నామన్న మోదీ దేశ భద్రత అంశంలో రాజీపడే ప్రసక్తే లేదని ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవడానికి వెనుకాడమని చెప్పారు.   సంప్రదాయ కుర్తా, నీలం రంగు జాకెట్, కాషాయ రంగు తలపాగా చుట్టుకున్న ప్రధాని దాదాపుగా 90 నిముషాల సేపు ప్రసంగించారు.

సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్‌ అన్న నినాదానికి కొత్తగా సబ్‌కా ప్రయాస్‌ (సమష్టి కృషి) అన్న దానిని చేర్చారు. భారత్‌ నిర్దేశించుకున్న 100శాతం లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రజలందరి కృషి అత్యంత అవసరమని గట్టిగా చెప్పారు. అందుకే రాబోయే 25 ఏళ్లు అమృత కాలంగా ప్రధాని అభివరి్ణంచారు. దేశ స్వాతంత్య్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన మహాత్మా గాం«దీ, సుభాష్‌ చంద్రబోసు, భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్, బి.ఆర్‌. అంబేద్కర్‌ వంటి నేతలందరినీ ప్రధాని పేరు పేరునా స్మరించారు.

యువత ఏదైనా చేయగలదు
నేటి యువతరంపై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. నేటి తరం ఏదైనా చేయగలదు, ప్రతీ లక్ష్యాన్ని సాధించగలదు అన్నారు. ‘‘నాకు ఈ దేశ యువతపై విశ్వాసం ఉంది. దేశ సోదరీమణులపై నమ్మకం ఉంది. రైతులను, వృత్తి నిపుణులను నేను పూర్తిగా విశ్వసిస్తాను. మన కలలు, ఆశయాలను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. మనలో ఉన్న ఉత్సాహం, మనలో ఉన్న సోదరభావమే మన బలం’’ అని మోదీ అన్నారు. ‘‘ఇదే సరైన సమయం. దేశానికి అత్యంత కీలకమైన సమయం. అసంఖ్యాకమైన ఆయుధాలు మనదగ్గరున్నాయి. దేశభక్తి ప్రతీ చోటా పొంగిపొరలుతోంది.   అందరూ కదిలి రండి. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయండి. దేశ భవితను సమున్నతంగా రెపరెపలాడించండి’’ అని మోదీ ఒక కవితతో తన ప్రసంగాన్ని ముగించారు.  

మోదీ ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలు   
► దేశం నలుమూలలకి రైలు కనెక్టివిటీ పెరిగేలా ఆజాదీ కా అమృత్‌ ఉత్సవాల్లో భాగంగా 75 వారాల్లో 75 కొత్త వందేభారత్‌ రైళ్లు ప్రవేశ పెడతాం. ఈశాన్య రాష్ట్రాల రాజధానులన్నీ కలిపేలా  రైలు కనెక్టివిటీని ఏర్పాటు చేస్తాం.  
► వ్యవసాయం రంగంలో 80శాతానికిపైగా ఉన్న చిన్న రైతులే దేశానికి గర్వకారణం. వారికి అండగా ఉండడానికే ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి నుంచి 10 కోట్ల మంది రైతులకు ఇప్పటివరకు రూ.1.5 లక్షల కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం.  
► 2024 నాటికి  గ్రామీణ ప్రజలందరి ఇళ్లకి కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలన్న  ఉద్దేశంతో ప్రారంభించి జాతీయ జల జీవన్‌ మిషన్‌లో భాగంగా గత రెండేళ్లలో 4.5 కోట్ల ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చాం  
► దేశ విభజన గాయాలు ఇంకా వెంటాడుతున్నాయని ఆగస్టు 14న విభజన గాయాల స్మృతి దినంగా పాటిద్దామని పిలుపునిచ్చారు.  
► టోక్యో ఒలింపిక్స్‌లో భారత కీర్తి పతాక రెపరెపలాడింది. నేటి యువత మన దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.  
► ఏడేళ్ల క్రితం భారత్‌ 800 కోట్ల డాలర్ల విలువైన మొబైల్‌ ఫోన్లను దిగుమతి చేసుకునేది. అదే ఇప్పుడు 300 కోట్ల డాలర్ల విలువైన మొబైల్స్‌ను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. దిగుమతుల్ని గణనీయంగా తగ్గించింది.
► కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీలో మన శాస్త్రవేత్తల కృషి అత్యంత గర్వకారణ.  రెండు మేకిన్‌ ఇండియా వ్యాక్సిన్లు అభివృద్ధి చేయగలిగాం. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం.
► జమ్మూ కశీ్మర్‌లో నియోజకవర్గాల పునరి్వభజన కసరత్తు జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయి
► కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానం పేదరిక నిర్మూలన కోసమేనని, విద్యాబోధన వారి మాతృభాషలో చేయడానికే ప్రోత్సాహం
► అన్ని అంశాల్లోనూ ప్రభుత్వ అనవసర జోక్యాలు తగ్గించాం. పన్నుల్లో సంస్కరణలు తీసుకువచ్చి వాణిజ్యాన్ని సులభతరం చేశాము.  

రూ.100 లక్షల కోట్లతో గతిశక్తి భారత్‌
ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా 100 లక్షల కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకమైన గతిశక్తి ప్రాజెక్టును ప్రకటించారు.  ‘‘అత్యంత ఆధునిక సదుపాయాల కల్పనలో సంపూర్ణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం త్వరలోనే ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ ప్రణాళికను ప్రారంభించబోతున్నాం. రూ.100 లక్షల కోట్లతో ప్రారంభించే ఈ పథకం ద్వారా లక్షలాది మంది యువతికి ఉపాధి అవకాశాలు వస్తాయి’’ అని ప్రధాని వివరించారు.

సైనిక స్కూళ్లలో అమ్మాయిలకూ ప్రవేశం
దేశవ్యాప్తంగా ఉన్న సైనిక స్కూళ్లలో అబ్బాయిలకే ప్రవేశం ఉండేది. అయితే అమ్మాయిలను కన్న తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో ఈ ఏడాది నుంచి అమ్మాయిలకు కూడా అన్ని సైనిక స్కూళ్లలో ప్రవేశానికి అనుమతిలిస్తున్నాం.. అని ప్రధాని మోదీ చెప్పారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 సైనిక స్కూళ్లు ఉండగా, రెండున్నరేళ్ల క్రితం మిజోరంలోని సైనిక స్కూలులో ప్రయోగాత్మకంగా అమ్మాయిలకి ప్రవేశం కలి్పంచారు.  

కాషాయ రంగు తలపాగాతో ప్రధాని
గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో రంగురంగుల ఆకర్షణీయమైన తలపాగాలు ధరించే సంప్రదాయా న్ని ప్రధాని మోదీ కొనసాగించారు. ఆదివారం ఆయన ఎర్రటి చారలు కలిగిన కాషాయరంగు తలపాగాతో ఎర్రకోట బురుజుల పైనుంచి ప్రసంగించారు. సంపద్రాయ కుర్తా, చుడిదార్‌తో పాటు బ్లూ జాకెట్, ఉత్తరీయం వేసుకున్నారు.

జాతీయ హైడ్రోజన్‌ మిషన్‌  
గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి, ఎగుమతుల హబ్‌గా భారత్‌కు మార్చడానికి ప్రధానమంత్రి జాతీయ హైడ్రోజన్‌ మిషన్‌ను ప్రకటించారు. స్వతంత్ర భారతావని శతాబ్ది ఉత్సవాల సమయానికి ఇంధన రంగంలో స్వయంసమృద్ధిని సాధిస్తామని చెప్పారు.  ఇది సాధించడానికి కృషి చేస్తామని త్రివర్ణ పతాకం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నానని ప్రధాని చెప్పారు.  

మరిన్ని వార్తలు