ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌కు భారత్‌లో బ్రేక్‌

11 Sep, 2020 04:30 IST|Sakshi

తాత్కాలికంగా ప్రయోగాలు నిలిపివేత: సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌

న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలు మన దేశంలోనూ ఆగాయి. ఈ ప్రయోగాలను నిర్వహిస్తున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఆస్ట్రాజెనెకా తిరిగి ప్రయోగాలు చేపట్టేవరకు తామూ నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. పరిస్థితుల్ని సమీక్షించడానికి ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామంటూ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాల్లో ఉండగా టీకా డోసు ఇచ్చిన ఒక వాలంటీర్‌కి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రయోగాలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టుగా వెల్లడించిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ పూర్తిగా సురక్షితమని తేలేవరకూ భారత్‌లో రెండు, మూడో దశలకు ఇచ్చిన అనుమతుల్ని ఎందుకు సస్పెండ్‌ చేయకూడదో చెప్పాలంటూ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) డాక్టర్‌ వి.జి. సొమానీ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి షోకాజ్‌ నోటీసులు పంపింది.

ఆ నోటీసులు అందుకున్న తర్వాతే ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా సీరమ్‌ వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలకు బ్రేక్‌ పడినప్పటికీ ముందుగా అనుకున్నట్టుగానే ఈ ఏడాది చివరికి టీకాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆస్ట్రాజెనెకా సీఈఓ పాస్కాల్‌ సోరియెట్‌ చెప్పారు. టీకా భద్రతపై సమీక్షను వేగవంతంగా పూర్తి చేసి ఈ ఏడాది చివరికి, లేదంటే వచ్చే ఏడాది మొదట్లో వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.

కరోనాకు చైనా నాజల్‌ స్ప్రే వ్యాక్సిన్‌
బీజింగ్‌: కరోనాను నిలువరించడానికి నాజల్‌ స్ప్రే వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కి చైనా అనుమతించింది. తొలి దశ క్లినికల్‌ ట్రయల్‌ నవంబర్‌లో ప్రారంభం కావొచ్చని చైనా తెలిపింది. చైనాకి చెందిన నేషనల్‌ మెడికల్‌ ప్రొడక్ట్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఈ తరహా వ్యాక్సిన్‌ని ఆమోదించడం ఇదే తొలిసారి.

మరిన్ని వార్తలు