పొలానికో డ్రోన్‌: మోదీ

28 May, 2022 05:26 IST|Sakshi

భారత్‌ డ్రోన్‌ మహోత్సవ్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: పరిపాలనా వ్యవహారాల్లో సాంకేతికతను వినియోగించుకోవడంపై గతంలో చూపిన అలక్ష్యం కారణంగా పేదలు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ ఇబ్బందులకు గురయ్యారని ప్రధాని మోదీ చెప్పారు. ‘ఎనిమిదేళ్లుగా మా ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు కూడా సేవలందించేందుకు డ్రోన్లు సహా అన్ని రకాల సాంకేతికతను వినియోగించుకుంటోంది. సులభతర జీవనం, సులభతర వాణిజ్యానికి ప్రాధాన్యం ఇస్తోంది. సుపరిపాలనకు కొత్త విధానాలను అమలు చేస్తోంది.

రోజువారీ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని కనీస స్థాయికి తీసుకువచ్చింది’అని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ ఎగ్జిబిషన్‌ భారత్‌ డ్రోన్‌ మహోత్సవ్‌–2022ను ఆయన శుక్రవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ప్రారంభించారు. డ్రోన్‌ సాంకేతికతను ఉపయోగించుకుని సుపరిపాలన, సులభతర జీవనం సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం ఆశించిన గ్రామస్వరాజ్‌ సాధనకు డ్రోన్లు ఉపకరిస్తాయని చెప్పారు. గత ప్రభుత్వాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక సమస్యగా, పేదల వ్యతిరేక వ్యవహారంగా చిత్రీకరించాయన్నారు.

‘దేశం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న వేళ ప్రతి భారతీయుడి చేతిలో ఒక స్మార్ట్‌ఫోన్, ప్రతి పొలంలో ఒక డ్రోన్, ప్రతి ఇల్లూ సౌభాగ్యంతో ఉండాలన్నదే తన కల అని ప్రధాని తెలిపారు. ప్రజల జీవితాల్లో డ్రోన్‌ కూడా ఒక భాగంగా మారనుందని చెప్పారు. డ్రోన్‌ పరిజ్ఞానం వినియోగంతో వ్యవసాయం రంగం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డ్రోన్‌ సాంకేతికతను వ్యవసాయం, క్రీడలు, మీడియా, రక్షణ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో వినియోగించుకోవడం ద్వారా ఈ రంగంలో ఎందరికో ఉద్యోగావకాశాలున్నాయని తెలిపారు. డ్రోన్‌ సాంకేతికతపై అందరికీ అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఎన్నో అనేక అవరోధాలను తొలగించిందని చెప్పా రు.

‘మారుమూల ప్రాంతాల్లోని వారికి డ్రోన్ల సా యంతో అత్యవసరమైన ఔషధాలు వంటి వాటిని సులభంగా చేరవేయవచ్చు. పోలీసులు కూడా వీటి సేవలను వినియోగించుకోవచ్చు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టి, అత్యాధునిక డ్రోన్‌ సాంకేతికతను భారత్‌తోపాటు ప్రపంచానికి అందించాలని పెట్టుబడిదారులను కోరుతున్నా’అని ప్రధాని పిలుపునిచ్చారు. ఉత్పాదకత అనుసంధాన పథకం(పీఎల్‌ఐ) వంటి విధానాల ద్వారా దేశంలో పటిష్టమైన డ్రోన్‌ ఉత్పత్తి విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఎగ్జిబిషన్‌ ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ ఒక డ్రోన్‌ను ఆపరేట్‌ చేశారు.
డ్రోన్‌ను పరీక్షిస్తున్న ప్రధాన మంత్రి మోదీ

మరిన్ని వార్తలు