పాక్‌ కుట్రను తిప్పి కొట్టిన భారత్‌

11 Oct, 2020 04:48 IST|Sakshi

శ్రీనగర్‌: భారత్‌లో పేలుళ్లే లక్ష్యంగా పాక్‌ పన్నిన కుట్రల్ని భారత ఆర్మీ భగ్నం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి కశ్మీర్‌లోని కెరాన్‌ సెక్టార్‌కు భారీ ఎత్తున ఆయుధాలు తరలించడానికి చేసిన ప్రయత్నాలను ఆర్మీ తిప్పికొట్టినట్టు సైనిక అధికారి ఒకరు  వెల్లడించారు. కెరాన్‌ సెక్టార్‌లో నాలుగు ఏకే74 రైఫిళ్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కిషన్‌గంగ నది మీదుగా ఒక తాడు సాయంతో ఇద్దరు, ముగ్గురు దుండగులు ఒక పెద్ద ట్యూబులో ఆయుధాలను ఉంచి తరలిస్తుండగా జవాన్లు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగి రైఫిల్స్, 8 మ్యాగజైన్స్‌తో పాటుగా రెండు పెద్ద సంచుల నిండా ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆ ప్రాంతమంతా అణువణువునా గాలిస్తున్నట్టుగా లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ బీఎస్‌ రాజు వెల్లడించారు. ‘అప్రమత్తంగా ఉంటూ పాక్‌ చేసిన ఏ పనినైనా తిప్పి కొడతాం’అని చెప్పారు. కెరాన్, టాంగ్‌ధర్, జమ్మూ, పంజాబ్‌ సెక్టార్లలో కశ్మీరీ యువతని ఉగ్రవాదం వైపు మళ్లించడానికి పాక్‌ నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉందని ఆ కమాండర్‌ తెలిపారు. కాగా, కశ్మీర్‌లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్‌ జిల్లాలోని చింగామ్‌లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు సోదాలు చేపట్టాయి. నక్కి ఉన్న ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరపగా, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.  దదూరా ప్రాంతంలో ఇదే రీతిలో జరిగిన మరో ఎన్‌కౌంటర్లో కూడా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

మరిన్ని వార్తలు