బీమా ప్రకటనల నిబంధనల్లో మార్పులు

27 Oct, 2020 08:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీమా వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ది ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ) కీలకమైన అడుగులు వేసింది. కొనుగోలుదారుల సహేతుకమైన అంచనాలకు మించి క్లెయిములు చేసే ప్రకటనలు జారీ చేయకూడదని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది. అన్యాయమైన, తప్పుదోవ పట్టించే ప్రకటనలలో పాలసీని గుర్తించడంలో, నిబంధనలకు సరిపోని ప్రయోజనాలను వివరించడంలో విఫలమవుతాయని ఐఆర్‌డీఏఐ తెలిపింది. బీమా రంగంలో కొత్త ప్రకటనల నిబంధనలు తీసుకురావాలని ఐఆర్‌డీఏఐ తెలిపింది. ఈ మేరకు నవంబర్‌ 10 లోగా స్టేక్‌హోల్డర్లు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలను ఇవ్వాలని కోరింది. 

ప్రతిపాదిత నిబంధనల ముఖ్య ఉద్దేశం బీమా సంస్థలు, మధ్యవర్తులు ప్రకటనలు జారీ చేసేటప్పుడు న్యాయమైన, నిజాయితీ, పారదర్శక విధానాలను పాటించాలని, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే పద్ధతులను నివారించడమేనని తెలిపింది. బీమా ప్రస్తుతం పనితీరుతో పాటు భవిష్యత్తు ప్రయోజనాలు, అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉండాలని లేని పక్షంలో ఇది కూడా తప్పుదోవ పట్టించే ప్రకటనలుగానే పరిగణించ బడతాయని తెలిపింది. ప్రస్తుతం బీమా ప్రకటనల నిబంధనలను సమీక్షించాల్సిన అవసరం ఉందని, గత రెండు దశాబ్ధాలుగా ప్రకటనల పరిణామ పోకడలు, మాధ్యమం, సాంకేతిక పరిణామాలు, అభివృద్ధి తదితరాలను సమీక్షించాలని తెలిపింది. అడ్వర్టయిజ్‌మెంట్‌ నిర్వచనం, తప్పుదోవ పట్టించే ప్రకటన అనే పదం పరిధిని విస్తరించడం, థర్డ్‌ పార్టీ బీమాదారులను కూడా బాధ్యులను చేయడం వంటివి ప్రస్తుతం నిబంధనల మార్పులలో కీలకమైనవని తెలిపింది.

మరిన్ని వార్తలు