ఇదెక్కడి న్యాయం.. ఆ వార్త రాసిన జర్నలిస్టులపై ఐటీ యాక్ట్‌ కింద కేసులా?

21 Aug, 2022 12:48 IST|Sakshi

భోపాల్‌: అనారోగ్యానికి గురైన ఓ వృద్ధుడిని కుటుంబ సభ్యులు తోపుడు బండిపై ఆసుపత్రికి తరలించారు. ఆ కుటుంబం పడిన బాధను వివరిస్తూ వార్త ఇచ్చారు స్థానిక జర్నలిస్టులు. దీనిపై ఆగ్రహం వ‍్యక్తం చేసిన పోలీసులు.. ముగ్గురు స్థానిక జర్నలిస్టులపై చీటింగ్‌, వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టటం, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. వారు ఇచ్చిన వార్త పూర్తిగా తప్పు, ఎలాంటి ఆధారాలు లేవు. అయితే, వీడియోలోని కుటుంబం తాము పడిన ఇబ్బంది నిజమేనని, వార్తల్లో వచ్చిందంతా నిజమేనని పేర్కొనటం గమనార్హం. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌, భింద్‌ జిల్లాలోని లహర్‌ ప్రాంతం మార్పురా గ్రామంలో జరిగింది. 

జిల్లా కలెక్టర్‌ సతీశ్‌ కుమార్‌ ఏర్పాటు చేసిన రెవెన్యూ, ఆరోగ్య విభాగాల దర్యాప్తు బృందాలు.. బాధిత కుటుంబం అంబులెన్స్‌ కోసం ఎలాంటి ఫోన్‌కాల్‌ చేయలేదని నివేదించాయి. వృద్ధుడు జ్ఞానప్రసాద్‌ విశ్వకర్మను ముందుగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారని, గవర్నమెంట్‌ ఆసుపత్రికి కాదని పేర్కొన్నాయి. ఈ నివేదిక ఆధారంగా.. డాక్టర్‌ రాజీవ్‌ కౌరవ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వార్త రాసిన కుంజ్‌బిహారీ కౌరవ్‌, అనిల్‌ శర్మ, ఎన్‌కే భతేలేపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. 

అంబులెన్స్‌ రాకపోవటంతో తోపుడు బండిపై 5 కిలోమీటర్లు
తాము ఫోన్‌ చేసినా అంబులెన్స్‌ రాకపోవటంతో 5 కిలోమీటర్లు తోపుడు బండిపై తీసుకెళ్లినట్లు బాధితుడి కుమారుడు హరిక్రిష్ణ, కూతురు పుష్ప తెలిపారు. తమ కుటుంబం వివిధ ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందినట్లు దర్యాప్తు బృందాలు నివేదించటాన్ని తప్పుపట్టారు పుష్ప. తమకు పీఎం ఆవాస్‌ యోజన కింద ఒకే ఇన్‌స్టాల్‌మెంట్‌ వచ్చిందని, అధికారులు మా సోదరుడి ఇంటి ముందు నిలబెట్టి ఫోటోలు తీసుకెళ్లారని అధికారులపై విమర్శలు గుప్పించారు. ఇటీవల తమ గుడిసె వద్దకు వచ్చి తెల్లపేపర్‌పై సంతకాలు చేయించుకుని వెళ్లారన్నారు. అయితే, ఈ ఆరోపణలపై అధికారులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఇదీ చదవండి: ‘ఈ జిమ్మిక్కులు ఏమిటి.. మోదీ జీ?’.. ట్రావెల్‌ బ్యాన్‌పై మనీశ్‌ సిసోడియా విమర్శలు

మరిన్ని వార్తలు