పాలిథీన్‌ చెత్తతో రండి.. గోల్డ్‌ కాయిన్‌తో వెళ్లండి: ఊరి బాగు కోసం ఆ సర్పంచ్‌..

16 Feb, 2023 19:47 IST|Sakshi

అనంతనాగ్‌(జమ్ము కశ్మీర్‌): ఈ భూమ్మీద పనికిరాని వస్తువంటూ ఏదీ ఉండదు. మనసు పెడితే.. చెత్త కూడా బంగారమే అవుతుంది!. నమ్మరా?.. అయితే.. ఆ సర్పంచ్‌ వైవిధ్యభరితమైన ఆలోచన, దాని వెనుక ఉన్న బలమైన కారణం.. ఏడాది కాలంలో ఆ ప్రయత్నంతో తన ఊరిలో తెచ్చిన మార్పు గురించి తెలుసుకోవాల్సిందే!.

ఫరూఖ్ అహ్మద్ ఘనై.. పాలిథీన్‌ చెత్తతో వచ్చి గోల్డ్‌ కాయిన్‌తో వెళ్లమంటున్నాడు. జమ్ము కశ్మీర్‌ అనంత్‌నాగ్‌ జిల్లాలోని కొండల మధ్య ఉండే సాదివారా అనే ఓ గ్రామానికి ఆయన సర్పంచ్‌. పైగా లాయర్‌ కూడా. పర్యావరణానికి జరుగుతున్న నష్టం.. ఒక తీవ్రమైన సమస్యగా అర్థం చేసుకున్నాడాయన. శుభ్రత మీద ఇప్పుడు దృష్టిసారించకపోతే.. రాబోయే పదేళ్లలో సారవంతమైన భూమి, స్వచ్ఛమైన నీటి వనరులను కనుగొనలేరంటూ ప్రజలను హెచ్చరిస్తున్నారాయన.

ఇంట్లో పేరుకుపోయిన పాలిథీన్‌ చెత్తను బహిరంగ ప్రదేశాలు, పొలాల్లో, నీళ్లలో పడేస్తున్నారు గ్రామస్తులు. అది నేలలో కలిసిపోవడం జరగని పని. అందుకే శుభ్రత కోసం అధికారులు, ప్రభుత్వం శ్రమించే కంటే.. ప్రజలే దృష్టిసారించడం మేలని భావించాడాయన. అలాగే ప్రజల్లో అవగాహన కల్పించడం కంటే.. వాళ్లకు ఆశ కల్పిస్తే ఎలా ఉంటుందని భావించాడు. అందుకే పాలిథీన్‌ చెత్తతో రండి.. బంగారు కాయిన్‌తో వెళ్లండి అనే పిలుపు ఇచ్చాడు. 

ఎవరైతే 20 క్వింటాళ్లకు తగ్గకుండా, అంతకు మించి పాలిథీన్‌ చెత్త తీసుకొస్తారో.. వాళ్లకు ఓ గోల్డ్‌ కాయిన్‌ ఇస్తున్నాడు. అలాగే.. అంతకంటే కాస్త తక్కువ చెత్త వచ్చినవాళ్లకు సిల్వర్‌ కాయిన్‌ బహుకరిస్తున్నాడు. అంత చెత్త తెచ్చి ఎవరు ఇస్తాడని అనుకోకండి!. ఈ ఐడియా వర్కవుట్‌ అయ్యింది. ఏడాదిలోనే ఎంతో మార్పు తెచ్చిందని సంబురపడిపోతున్నాడాయన. అంతేకాదు.. ఈ ఆలోచన జిల్లా అధికారులను సైతం కదిలించింది. అన్ని పంచాయితీల్లోనూ ఈ ప్రణాళిక అమలు చేయాలని జిల్లా అభివృద్ధి అధికార యంత్రాంగం నిర్ణయించుకుంది. 

మరిన్ని వార్తలు