Uttarkashi Tunnel: కొడుకును చూడకుండానే తండ్రి మృతి

29 Nov, 2023 11:02 IST|Sakshi

ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా టన్నెల్‌లో 17 రోజులుగా చిక్కుకున్న 41 మంది కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లా దుమారియా బ్లాక్‌కు చెందిన ఆరుగురు కూలీలు కూడా ఉన్నారు. 29 ఏళ్ల భక్తు ముర్ము వారిలో ఒకడు. కుమారుడు క్షేమంగా బయటకు వస్తాడని ఎదురుచూసిన 70 ఏళ్ల తండ్రి బాసెట్ అలియాస్ బర్సా ముర్ము మంగళవారం కుమారుడిని చూడకుండానే మృతి చెందాడు.

భక్తు ముర్ము 17 రోజుల అనంతరం సొరంగం నుండి బయటకు వచ్చి, తన తండ్రి మరణవార్త తెలుసుకుని తల్లడిల్లిపోయాడు. ఈ సందర్భంగా బర్సా ముర్ము కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ‘మంగళవారం ఉదయం అల్పాహారం చేసిన తర్వాత బర్సా ముర్ము తన అల్లుడితో కలిసి, ఇంటిలోని మంచం మీద కూర్చున్నాడని, ఇంతలోనే అకస్మాత్తుగా మంచం మీద నుంచి కిందపడి చనిపోయాడని’ తెలిపారు. 

బర్సా ముర్ము అల్లుడు మాట్లాడుతూ.. ‘భక్తు ముర్ము సొరంగంలో చిక్కుకున్నాడనే సమాచారం అందిన తర్వాత అతని తండ్రి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. భక్తు ముర్ము సోదరుడు రాంరాయ్ ముర్ము చెన్నైలో ఉంటాడని, మరో సోదరుడు మంగళ్ ముర్ము కూలి పనులు చేస్తుంటాడని’ తెలిపారు.
ఇది కూడా చదవండి: ‘ప్రిన్స్‌’ను గుర్తుచేసిన ఉత్తరాఖండ్‌ రెస్క్యూ ఆపరేషన్‌

మరిన్ని వార్తలు