కంగనా నివాసం అక్రమ కట్టడం : బీఎంసీ

13 Sep, 2020 20:39 IST|Sakshi

బాలీవుడ్‌ క్వీన్‌కు బీఎంసీ నోటీసులు

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ ముంబై కార్యాలయాన్ని బ్రిహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) కూలగొట్టిన కొద్దిరోజులకే బీఎంసీ నుంచి ఫైర్‌బ్రాండ్‌ నటికి మరో నోటీసు అందింది. ఖర్‌లోని ఆమె ఇంటిని అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ బీఎంసీ ఈ నోటీసులు జారీ చేసింది. పాలీహిల్‌లోని ఆమె కార్యాల్యం కంటే ఇంటి నిర్మాణంలోనే అధికంగా అవకతవకలు చోటుచేసుకున్నాయని బీఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. ఖర్‌ వెస్ట్‌ ప్రాంతంలోని భవనంలో కంగనా ఐదో అంతస్తులో ఉంటున్నారు. ఈ భవనంలో ఆమెకు మూడు ఫ్లాట్స్‌ ఉన్నాయి. సెప్టెంబర్‌ 9న కంగనా ముంబైకి చేరుకునేందుకు సిద్ధమైన క్రమంలో ఆమె కార్యాలయాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ బీఎంసీ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే.

తన కార్యాలయం కూల్చివేతను నిలిపివేయాలని కోరుతూ కంగనా రనౌత్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆపై కంగనా కార్యాలయ కూల్చివేతపై కోర్టు స్టే విధించి నటి పిటిషన్‌పై అఫిడవిట్‌ దాఖలు చేయాలని బీఎంసీని ఆదేశించింది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ మృతి కేసుపై ముంబై పోలీసుల దర్యాప్తు పట్ల తనకు విశ్వాసం లేదని కంగనా ప్రకటించడంతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే నగరంలో ఉండరాదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలతో బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌, శివసేనల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సంజయ్‌ రౌత్‌ తనను బెదిరించారని అంటూ ముంబైని పీఓకేతో కంగనా పోల్చడం కలకలం రేపింది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం తన పట్ల వ్యవహరిస్తున్న తీరును వివరించేందుకు కంగనా మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారీతో భేటీ అయ్యారు. చదవండి : మహారాష్ట్ర గవర్నర్‌తో కంగనా భేటీ

మరిన్ని వార్తలు