మైసూరు అత్యాచార ఘటన: అయిదుగురు అరెస్ట్‌!

28 Aug, 2021 14:55 IST|Sakshi
ఫోటో కర్టసీ: ఎన్డీ టీవీ

మైసూరు కేసు దర్యాప్తులో పురోగతి

సాక్షి, బెంగళూరు: మైసూరులో విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన కేసు దర్యాప్తులో పురోగతి కనిపించింది. ఈ కేసుకు సంబంధించి అయిదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కర్ణాటక డీజీపీ ప్రవీణ్‌ సూద్‌ తెలిపారు. ఆరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారని పేర్కొన్నారు. అరెస్టయిన అయిదుగురు తమిళనాడులోని తరుప్పూర్‌ జిల్లాకు చెందిన అరటిపండ్లు విక్రయించే కూలీలుగా పోలీసులు గుర్తించారు. అయితే వారిలో ఒకరు 17 ఏళ్ల బాలనేరస్తుడని అనుమానిస్తున్నారు. తమిళనాడులోని సత్యమంగళలో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో వ్యక్తిని కర్ణాటకలోని చామరాజనగర్‌లో పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన నలుగురు నిందితుల్లో ముగ్గురు నేర చరిత్ర కలిగి ఉన్నారు.
చదవండి: మైసూరు ఘటన: వీడియోలు తీసి.. 3 లక్షలు డిమాండ్‌

కాగా మైసూరు నగరం చాముండి కొండ సమీపంలో ఈనెల 24న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. మొత్తం ఐదు ప్రత్యేక బృందాలు ఈ కేసును వివిధ కోణాల్లో విచారిస్తున్నాయి. తొలుత ఇంజినీరింగ్‌ చదువుతున్న నలుగురు విద్యార్థులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారని వార్తలు వచ్చాయి. వీరంతా మైసూరులో ఇంజినీరింగ్‌ చదువుతున్నారని, వీరిలో ముగ్గురు తమిళనాడు, ఒకరు కేరళకు చెందిన వారని దర్యాప్తులో వెలుగు చూసినట్లు ప్రచారం జరిగింది. అయితే తరువాత వారికి ఈ నేరంతో సంబంధం లేనట్లు తేలింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు