75 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి విద్యుత్తు కనెక్షన్‌.. సంతోషంలో ప్రజలు

9 Jan, 2023 10:46 IST|Sakshi

శ్రీనగర్‌: భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తవుతున్నా ఇంకా చాలా గ్రామాలు కనీస సౌకర్యాలకు ఆమడ దూరంలోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మారుమూల ప్రాంతాలు వెలుగులోకి వస్తున్నాయి. అదే కోవకు చెందుతుంది జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లా డూరు బ్లాక్‌ పరిధిలోని టెథాన్‌ గ్రామం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకంలో భాగంగా ఆ ఊరికి విద్యుత్తు సరఫరా ఏర్పాటు చేశారు అధికారులు. అనంతనాగ్‌ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి 75 ఏళ్ల తర్వాత కరెంట్‌ సరఫరా జరుగుతోంది. 

అనంతనాగ్‌ కొండ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామం టెథాన్‌లో సుమారు 200 మంది ప్రజలు నివసిస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం డెవలప్‌మెంట్‌ ప్యాకేజీ స్కీమ్‌లో విద్యుత్తు సరఫరాను అందించారు అధికారులు.  గ్రామంలో 75 ఏళ్ల తర్వాత తొలి విద్యుత్తు దీపం వెలిగింది. తమ ఇళ్లల్లో విద్యుత్తు కాంతులు చూసి అక్కడి ప్రజలు మురిసిపోతున్నారు. ఇప్పటి వరకు తమ అవసరాల కోసం సాంప్రదాయ కలప, దీపాలను వాడేవారు. 

‘ఈరోజు తొలిసారి విద్యుత్తు కాంతులను చూస్తున్నాం. ఇకపై మా పిల్లలు విద్యుత్తు దీపాల కింద చదువుకుంటారు. వారు చాలా సంతోషంగా ఉంటారు. కరెంట్‌ లేకపోవడంతో చాలా కష్టాలు పడ్డాము. ఇప్పటి వరకు మా అవసరాల కోసం సంప్రదాయ కలపను ఉపయోగించాం. ఇప్పుడు మా సమస్యలకు ఓ పరిష్కారం లభించింది. ప్రభుత్వానికి, విద్యుత్తు విభాగానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.’ అని ఫాజుల్‌ ఉదిన్‌ ఖాన్‌ అనే గ్రామస్థుడు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో విద్యుత్తు కాంతులను చూసి నృత్యాలు చేస్తున్నారని చెప్పారు.

ఇదీ చదవండి: ‘కశ్మీర్‌లో భాగం కావడమే మంచిది’.. విలీనానికే లద్దాఖ్‌ నేతల మొగ్గు!

మరిన్ని వార్తలు