సెన్సేషన్‌ మిస్టరీ కేసు.. శశికళను ప్రశ్నించిన పోలీసులు, భయమెందుకన్న సీఎం స్టాలిన్‌

21 Apr, 2022 15:35 IST|Sakshi
కొడనాడు ఎస్టేట్‌లో జయలలితతో శశికళ (పాత ఫొటో)

చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళను తమిళనాట సంచలనం సృష్టించిన కొడనాడు కేసులో పోలీసులు ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ప్రత్యేక బృందం గురువారం టీ నగర్‌లోని ఆమె ఇంటికి వెళ్లింది. సుమారు గంటకు పైగా ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం.

2017లో మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడ‌నాడు ఎస్టేట్‌ బంగ్లా వద్ద దొపిడీ, ఆపై వరుస మరణాల ఉదంతాలు కలకలం రేపాయి. ఎస్టేట్‌ సెక్యూరిటీ గార్డును హత్య చేసిన ఎస్టేట్‌లో ఉన్న పలటియల్‌ బంగ్లాలోకి ప్రవేశించిన దుండగలు.. ఓ వాచ్‌, ఖరీదైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు. ఈ దొపిడీ కేసుగానే భావించినా.. ఆ తర్వాత చోటు చేసుకున్న నాలుగు మరణాలు.. పలు అనుమానాలకు తావిచ్చాయి. 

ఈ దోపిడీలో కీలక అనుమానితుడిగా భావించిన జయలలిత మాజీ డ్రైవర్‌ కనగరాజ్‌ ఎడపాడి వద్ద ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అది మాజీ సీఎం పళనిస్వామి సొంతవూరు. అదే రోజు రెండో నిందితుడు సయన్‌ కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అదృష్టవశాత్తూ అతను బతికినా.. అతని భార్య, కూతురు చనిపోయారు. ఆ తర్వాత ఎస్టేట్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మరణాలకు.. జయలలిత మరణానికి ముడిపెడుతూ రాజకీయంగా అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

అయితే సెక్యూరిటీ గార్డు హత్య జరిగిన టైంలో.. శశికళ అవినీతి కేసులో బెంగళూరు జైల్లో ఉన్నారు. అయినప్పటికీ మిగతా హత్యలు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక టీంతో కొడనాడు మిస్టరీ కేసుల్ని దర్యాప్తు చేయిస్తామని ఎన్నికల హామీలో స్టాలిన్‌ చెప్పారు. అయితే ఇది తనను ఇరికించే ప్రయత్నమని పళనిస్వామి ఆరోపిస్తుండగా.. కోర్టు అనుమతులతోనే తాము ముందుకెళ్తున్నామని, ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ చెప్తున్నారు. ఇదిలా ఉండగా.. జయలలిత అంత‌రంగికురాలు అయిన శశికళకు ఈ ఎస్టేట్‌లో భాగం ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: శశికళకు చెన్నై కోర్టులో ఎదురు దెబ్బ

మరిన్ని వార్తలు