దేశంలో మోదీ రాజ్యాంగం నడుస్తోంది: కేటీఆర్‌

27 Jun, 2022 13:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా.. సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. నామినేషన్‌ దాఖలు అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్‌..‘‘యశ్వంత్‌ సిన్హాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము. ఆయనను హైదరాబాద్‌ రావాలని ఆహ్వానించాము. ఎన్నికల్లో యశ్వంత్‌ సిన్హా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముపై మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు.

బీజేపీ నిరంకుశ తీరును మాత్రమే వ్యతిరేకిస్తున్నాము. దేశంలో అమలవుతున్నది అంబేద్కర్‌ రాజ్యాంగం కాదు.. బీజేపీ రాజ్యాంగం. దేశంలో మోదీ రాజ్యాంగం మాత్రమే అమలు అవుతోంది. మోదీ అక్రమాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ ప్రయత్నిస్తోంది. గిరిజనులపై నిజంగా బీజేపీకి అభిమానం ఉంటే తెలంగాణలో రిజర్వేషన్లను పెంచాలి. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. 

మెజార్టీ లేకపోయినా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. రాజ్యాంబద్ధమైన వ్యవస్థలను చేతిలో పెట్టుకుని బెదిరిస్తున్నారు. గట్టిగా ఎవరైనా మాట్లాడితే వెంటాడి మరీ వేధిస్తున్నారు.  విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో కేంద్రం దాడులు చేయిస్తోంది. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. కేంద్రంపై కచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తుంది. అయితే జుమ్లా.. లేదంటే హమ్లా. ప్రశ్నించే వారిని ఏజెన్సీలతో దాడులు చేయిస్తున్నారు. తెలంగాణకు ఎనిమిదేళ్లుగా మోదీ ఏం ఇచ్చారు?. దేశంలోని దళితుల కోసం కేంద్రం ఏం చేసింది?. తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందో.. శ్వేతపత్రం విడుదల చేయాలి.ప్రతీ దానికి సమయం వస్తుంది. నరేంద్ర మోదీది దద్దమ్మ గవర‍్నమెంట్‌. మోదీ నియంతృత్వ పోకడలపై నోరు విప్పాలి. వారిలో విషం తప్ప విషయం లేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: మహా పాలిటిక్స్‌లో ట్విస్ట్‌.. రాజ్‌ థాక్రేతో టచ్‌లో ఏక్‌నాథ్‌ షిండే

మరిన్ని వార్తలు