లఖింపూర్‌ ఖేరీ దళిత అక్కాచెల్లెల హత్యాచారం.. శిక్ష ఓ రేంజ్‌లోనే ఉంటుందన్న యోగి సర్కార్‌

15 Sep, 2022 14:03 IST|Sakshi

లక్నో: అక్కాచెల్లెలపై జరిగిన ఘోర కలితో యావత్‌ యూపీ రగిలిపోతోంది. లఖింపూర్‌ ఖేరీలో ఇద్దరమ్మాయిలపై హత్యాచారానికి పాల్పడిన ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులను ఇప్పటికప్పుడే ఉరి తీయాలని, ఎన్‌కౌంటర్‌ చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఉత్తర ప్రదేశ్‌ అక్కాచెల్లెల హత్యాచార ఘటనలో దర్యాప్తు శరవేగంగా ముందుకెళ్తోంది. పైగా బాధితులు దళితులు కావడంతో యూపీ పోలీసులపై ఒత్తిడి మరింతగా పెరిగింది. నిందితులు సుహేయిల్‌, జునైద్‌, హఫీజుల్‌ రెహమాన్‌, కరీముద్దీన్‌, ఆరిఫ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు, బాధితుల పక్కింట్లో ఉండే చోటును సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం బ్రజేష్‌ పాథక్‌ స్పందించారు. 

ఈ ఘటనపై యోగి సర్కార్‌ తీవ్రంగా స్పందించింది. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి కేసును త్వరగతిన పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. నిందితులకు విధించే శిక్షతో రాబోయే తరాల్లో ఇలాంటి నేరాలు చేయడానికి వెన్నులో వణుకుపుట్టాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. 

మరోవైపు శవపరీక్షలో మైనర్లపై అఘాయిత్యం జరిగిందని, చెరుకు తోటలో ఇద్దరమ్మాయిలపై సుహేయిల్‌, జునైద్‌లు రేప్‌కి పాల్పడగా.. మిగతావాళ్లు ఆధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారని ఎస్పీ సంజీవ్‌ సుమన్‌ వెల్లడించారు.  వాళ్ల దుపట్టాలతోనే ఉరేశారని, ఆపై చెరుకుతోటలోనే ఓ చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారని ఎస్పీ అన్నారు.

అయితే.. ఆ అక్కాచెల్లెళ్లు తమంతట తామే నిందితులతో వెళ్లారని పోలీసులు చెబుతుంటే.. బాధిత కుటుంబం మాత్రం వాళ్లు కిడ్నాప్‌కు గురయ్యారని వాపోతోంది. బలవంతంగా తమ బిడ్డలను బైకులపై తీసుకెళ్లారని ప్రత్యక్ష సాక్షి, బాధితురాళ్ల తల్లి చెబుతోంది. ఇంకోవైపు పోస్ట్‌మార్టం కోసం వచ్చిన పోలీసులను అడ్డుకున్నారు గ్రామస్తులు. రాత్రంతా హైడ్రామా నడిచింది ఆ ఊరిలో. మరోవైపు ఈ ఘటన..  2014లో బదౌన్‌ గ్యాంగ్‌రేప్‌ కేసును ఇది గుర్తుచేస్తోందని పలువురు అంటున్నారు.

ఇదీ చదవండి: పొలంలో చెట్టుకు విగతజీవులుగా వేలాడుతూ ఇద్దమ్మాయిలు!

మరిన్ని వార్తలు