ట్విన్‌ టవర్ల కూల్చివేత.. ఫ్లాట్‌లో నిద్రపోయిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

28 Aug, 2022 19:42 IST|Sakshi

లక్నో: నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ట్విన్‌ టవర్స్‌ను ఆదివారం అధికారులు కూల్చేసిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2.30 నిమిషాలకు వాటర్ పాల్ టెక్నిక్‌ను ఉపయోగించి.. బటన్‌ నొక్కి జంట భవనాలను నేలమట్టం చేశారు. కేవలం 9 సెకన్లలోనే ట్విన్‌ టవర్స్‌ కుప్పకూలాయి. ఈ టవర్స్‌ను కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు.

ట్విన్ టవర్స్ వద్ద నో ఫ్లైయింగ్ జోన్ అమలు చేయడంతో పాటు చుట్టుపక్కల 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు.  అయితే కూల్చివేత ప్రక్రియకు ముందుగానే పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ట్విన్ టవర్స్‌ చుట్టుపక్కల ఉన్న స్థానికులను ముందుగానే తాత్కాలికంగా ఖాళీ చేయించారు. ఇ అయితే సమీపంలో షెల్టర్‌ కల్పించిన వారు మాత్రం ఆదివారం ఉదయం వరకు తమ ఫ్లాట్లలోనే ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు వారు అక్కడి నుంచి షెల్టర్‌ కేంద్రాలకు వెళ్లారు.
చదవండి: Noida Twin Towers Demolition: వ్యర్థాల తొలగింపుకు ఎన్ని రోజులు పడుతుందో తెలుసా!

కానీ ఓ వ్యక్తి మాత్రం ఇంట్లో అలాగే పడుకుండిపోయాడు. ట్విన్‌ టవర్స్‌కు సమీపంలో ఉన్నటువంటి అపార్ట్‌మెంట్‌లోని టాప్‌ ఫ్లోర్‌లో గాఢంగా నిద్రిస్తూ ఉండిపోయాడు. ఖాళీ చేయాల్సిన నిర్ణీత సమయానికి అతడు మేల్కోలేదు. జంట టవర్ల కూల్చివేత ముందు చివరిసారి అన్నిచోట్ల తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఒక టవర్‌లోని పై అంతస్తు ఫ్లాట్‌లో నిద్రపోతున్న ఆ వ్యక్తిని సెక్యూరిటీ గార్డు గుర్తించాడు.వెంటనే టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో అతడ్ని నిద్ర లేపి అక్కడి నుంచి షెల్టర్‌కు పంపారు.కాగా కూల్చివేత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సకాలంలో ఆ వ్యక్తిని గుర్తించినట్లు టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు తెలిపారు.
చదవండి: నోయిడా ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత.. ఇప్పుడు కస్టమర్ల పరిస్థితి ఏంటి?

మరిన్ని వార్తలు