Mahadev app case: సీఎం బఘేల్‌కు డబ్బు పంపలేదు

26 Nov, 2023 06:17 IST|Sakshi

మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో నన్ను ఇరికించారు

ఈడీ వాంగ్మూలంపై మాట మార్చిన కొరియర్‌

రాయ్‌పూర్‌: మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసులో ఇటీవల ఈడీ అరెస్ట్‌చేసిన నగదు కొరియర్‌ ఆసిమ్‌ దాస్‌ తాజాగా మాటమార్చాడు. బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌కు రూ.508 కోట్ల నగదు పంపించారని విచారణలో అతడు అంగీకరించాడని ఈడీ వెల్లడించడం తెల్సిందే. ఆసిమ్‌ తన లాయర్‌ షోయబ్‌ అల్వీ ద్వారా మరో వాంగ్మూలమిస్తూ ఈడీ డైరెక్టర్, ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు.

‘‘ఈ కేసులో నన్ను బలిపశువును చేస్తున్నారు. వాస్తవానికి సీఎం బఘేల్‌సహా ఏ రాజకీయనేతకూ నేను డబ్బులు అందజేయలేదు. ఈడీ అధికారులు ఇంగ్లిష్లో ఉన్న వాంగ్మూలంపై బలవంతంగా నా సంతకం చేయించుకున్నారు. నాకు ఇంగ్లిష్‌ రాదు. ఎవరో వచ్చి డబ్బు సంచులు కారులో పెట్టి వెళ్లిపోయాడు. డబ్బుతో నేను హోటల్‌రూమ్‌కి వెళ్లగానే ఈడీ అధికారులొచ్చి అరెస్ట్‌చేశారు. కేసులో నన్ను కావాలనే ఇరికించారని నాకప్పుడు అర్ధమైంది’’ అని దాస్‌ వివరించారు.

మరిన్ని వార్తలు