అదరహో..! ఐదు రోజుల పాటు నిర్విరామంగా బాలిక డ్యాన్స్.. గిన్నీస్ రికార్డ్..

17 Jun, 2023 13:11 IST|Sakshi

మహారాష్ట్ర: మహారాష్ట్రకు చెందిన ఓ బాలిక అరుదైన ఘనత సాధించింది. నిరంతరాయంగా 127 గంటలపాటు డ్యాన్స్ చేసి గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించింది. డ్యాన్స్ మారథాన్‌లో ఐదు రోజులపాటు నిర్విరామంగా  క్లాసికల్ కథక్  నృత్యం చేసింది. మే 29 నుంచి జూన్ 3 వరకు ఈ మారథాన్‌లో పాల్గొని ఇప్పటివరకు ఉన్న 126 గంటల రికార్డ్‌ను అధిగమించింది.  

సృష్టి సుధీప్ జగతాప్(16) లాతూర్‌కు చెందిన బాలిక. నృత్యంలో మంచి ప్రతిభను చూపించింది. ఏదైనా గొప్పగా సాధించాలనే తన కలను నెరవేర్చుకుంది. నిర్విరామంగా ఐదు రోజుల పాటు క్లాసికల్ కథక్ నృత్యం చేసి గిన్నిస్ రికార్డును సాధించింది. అయితే.. ఈ అంశంలో ఇప్పటివరకు నేపాలీ డ్యాన్సర్ బందన 2018లోనే 126 గంటలపాటు నృత్యం చేసింది. ఆ రికార్డును ఇప్పుడు సుధీప్ జగతాప్ అధిగమించింది. 

అయితే.. ఈ డ్యాన్స్‌లో కేవలం ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సుధీప్ కేవలం రాత్రిళ్లు మాత్రమే ఈ అవకాశాన్ని వాడుకుని నృత్యం చేసింది. సుధీప్ ఎల్లప్పుడూ తన కాళ్లలో కదలికలను ఆపలేదని నిర్వహకులు తెలిపారు. 

తన తల్లిదండ్రులు ఎల్లప్పుడు తన పక్కనే ఉన్నారని సుధీప్ జగతాప్ చెబుతోంది.రాత్రిళ్లు నిద్ర రాకుండా ముఖంపై నీళ్లు చల్లేవారని తెలిపింది. చివరి గంటవరకు తన శరీరం కదలలేని పరిస్థితికి చేరినప్పటికీ లక్ష‍్యం మీదే దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. తాతయ్యతో పాటు యోగా తరగతులకు వెళ్లి యోగ నిద్ర సాధన చేశానని తెలిపింది. భారతీయ సంప్రదాయాన‍్ని ప్రపంచ వేదికకు తీసుకువెళ్లడమే ధ్యేయమని అంటోంది.

ఇదీ చదవండి:Aryan Dubey Rebirth Story: ‘ఆవిడ మా ఆవిడే..’ పునర్జన్మ చెబుతూ హడలెత్తిస్తున్న కుర్రాడు!

>
మరిన్ని వార్తలు