పుణెలో రుబెల్లా వ్యాధి కలకలం.. ఇద్దరు చిన్నారులకు పాజిటివ్‌..

21 Dec, 2022 13:53 IST|Sakshi

ముంబై: మహారాష్టత్ర పుణెలో మంగళవారం రెండు రుబెల్లా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు చిన్నారులకు పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ఈ ఏడాది ఇవే తొలి కేసులు కావడం గమనార్హం. ఇద్దరు చిన్నారుల్లో ఒక్కరు కోత్రుడ్, మరొకరు ఖరాడి ప్రాంతానికి చెందిన వారని పుణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.

అయితే ఇద్దరిలో ఖరాడీకి చెందిన 11 ఏళ్ల బాలుడు మీజిల్స్-రుబెల్లా టీకా తీసుకున్నాడని, అయినా వ్యాధి బారినపడ్డాడని అధికారులు పేర్కొన్నారు. మరో 12 ఏళ్ల బాలుడు వ్యాక్సిన్ తీసుకున్నాడో లేదో సమాచారం లేదని చెప్పారు.

ఈ రెండు రుబెల్లా కేసులతో పాటు నగరంలో మంగళవారం కొత్తగా 15 మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఏడాది నమోదైన మీజిల్స్ కేసుల సంఖ్య 26కు పెరిగింది. కేసులు వెలుగుచూస్తున్న ప్రాంతాల్లో నిఘా పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

మీజిల్స్, రుబెల్లా వ్యాధుల లక్షణాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయని రాష్ట్ర పర్యవేక్షణ అధికారి డా.ప్రదీప్ అవాతే తెలిపారు. వ్యాధి సోకిన చిన్నారుల్లో జ్వరం, దద్దుర్లు వస్తాయన్నారు. రుబెల్లా సోకిన వారికి మాత్రం దాదాపు లక్షణాలు కన్పించవని, స్వల్పంగా ఉంటాయని పేర్కొన్నారు. టీకాలు తీసుకున్న వారికి కూడా ఈ వ్యాధులు వస్తాయని స్పష్టం చేశారు. వాక్సిన్లు 90 శాతం ప్రభావం చూపుతున్నాయన్నారు.
చదవండి: రూ.500కే వంటగ్యాస్‌.. ఇది చూసైనా మారండి.. బీజేపీపై రాహుల్ సెటైర్లు..

మరిన్ని వార్తలు