మణిపూర్‌ హింసాకాండలో 175 మంది బలి

16 Sep, 2023 05:06 IST|Sakshi

32 మంది అదృశ్యం.. 1,108 మందికి గాయాలు  

4,786 ఇళ్లు దహనం..

మణిపూర్‌ పోలీసుల ప్రకటన  

ఇంఫాల్‌: జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ అట్టుడుకుతోంది. ఈ ఏడాది మే నెలలో హింసాకాండ మొదలైంది. రాష్ట్రంలో హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా 175 మంది మరణించారని, 32 మంది అదృశ్యమయ్యారని, 1,108 మంది గాయపడ్డారని మణిపూర్‌ పోలీసు శాఖ వెల్లడించింది. మరణించిన 175 మందిలో 96 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు ఇంకా తీసుకెళ్లలేదని, అవి వివిధ ఆసుపత్రుల్లో మార్చురీలోనే ఉన్నాయని పేర్కొంది.

అలాగే 9 మృతదేహాలను గుర్తించలేదని వివరించింది. దాడులు, ప్రతి దాడుల్లో 4,786 ఇళ్లు దహనమయ్యాయని తెలియజేసింది. మణిపూర్‌లో హింస మొదలైనప్పటి నుండి ఆయుధగారాల నుంచి 5,668 ఆయుధాలను దుండగులు ఎత్తుకెళ్లారు. వీటిలో 1,329 ఆయుధాలను భద్రతా బలగాలు మళ్లీ స్వా«దీనం చేసుకున్నాయి. అల్లరి మూకల నుంచి భారీగా మందుగుండు సామగ్రి, బాంబులను కూడా అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గృహ దహనాలకు సంబంధించి పోలీసులు 5,172 కేసులు నమోదు చేశారు. హింసాకాండకు సంబంధించి మొత్తం 9,332 కేసులు నమోదు చేశారు. 325 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని మణిపూర్‌ పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.  

అస్సాం రైఫిల్స్‌ను ఉపసంహరించాలి  
తమ రాష్ట్రం నుంచి అస్సాం రైఫిల్స్‌ దళాలను వెంటనే ఉపసంహరించాలని మణిపూర్‌ పౌర సమాజ సంస్థలతో కూడిన మణిపూర్‌ సమగ్రతపై సమన్వయ కమిటీ(కాకోమీ) ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. అస్సాం రైఫిల్స్‌ జవాన్లు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాకోమీ ప్రతినిధులు తాజాగా ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సమావేశమయ్యారు. 

మరిన్ని వార్తలు