-

నడ్డా కాన్వాయ్‌పై దాడి.. ఐపీఎస్‌ అధికారులకు సమన్లు

12 Dec, 2020 18:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి ఘటనకు సంబంధించి ముగ్గురు ఐపీఎస్‌ అధికారులకు కేంద్ర హోం శాఖ ఏకపక్ష సమన్లను జారీ చేసింది. జేపీ నడ్డా పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారులు భోలానాథ్‌ పాండే, ప్రవీణ త్రిపాఠీ, రాజీవ్‌ మిశ్రాలు తమ విధులను నిర్వర్తించటంతో అలసత్వం వహించారని హోంశాఖ పేర్కొంది. అంతకు క్రితం పశ్చిమ బెంగాల్‌ సీఎస్‌, డీజీపీలకు కేంద్ర హోం శాఖ‌ సమన్లు జారీ చేసింది. డిసెంబర్‌ 14వ తేదీన రాష్ట్రంలోని శాంతి,భద్రతలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే కేం‍ద్ర హోం శాఖ సమన‍్లను ‍ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నోటీసులపై స్పందించరాదన్న నిర్ణయానికి వచ్చింది. ( కేంద్రంతో మమత ఢీ )

కాగా, రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్‌ వెళ్లిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్‌ హార్బర్‌లో పట్టు పెంచుకోవడం కోసం నడ్డా రాష్ట్రానికి వెళ్లారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి గత గురువారం ఉదయం డైమండ్‌ హార్బర్‌కి వెళుతుండగా మార్గం మధ్యలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులుగా అనుమానిస్తున్న కొందరు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు.

మరిన్ని వార్తలు