Viral Video: ఎమ్మెల్యే కళ్లెదుటే.. బురద నీటిలో కేరళ వ్యక్తి స్నానం, యోగా..

11 Aug, 2022 12:25 IST|Sakshi

నిత్యం వందలు, వేల సంఖ్యలో వాహనాలు వెళ్లే రహదారులు దాదాపు రాత్రింబవళ్లు రద్దీగా ఉంటాయి. అలాంటి రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయాలుగా మారుతుంటాయి. ఇక వర్షాకాలంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వర్షం పడుతున్నంత సేపు వరద నీటితో రోడ్లు నిండిపోతే.. వాన వెలిసిన తర్వాత ఎక్కడ చూసినా సగం కొట్టుకుపోయిన రోడ్లు, గుంతలు, గతుకులే దర్శనమిస్తాయి.. 

ఇలాంటి రహదారులపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని  ప్రయాణం చేయాల్సి  ఉంటుంది. అయితే రోడ్ల మరమ్మత్తులు చేపట్టడం లేదని తాజాగా కేరళలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. ఇటీవల కురిసిన వ‍ర్షానికి మలప్పురం ప్రాంతంలోని రోడ్లపై గుంతలు ఏర్పడి నీళ్లు నిలిచిపోయాయి. అయితే దీనిని అధికారులు పట్టించుకోకపోవడంతో..  ఓ వ్యక్తి స్వయంగా రంగంలోకి దిగాడు. 

స్థానిక ఎమ్మెల్యే యూఏ లతీఫ్ ముందు ఎమ్మెల్యే ఎదురుగానే గుంతల్లోని నీటిలో స్నానం చేశాడు. ఎమ్మెల్యే కారు సంఘటనా స్థలానికి చేరుకోగానే గుంతలో ధ్యానం చేయడం ప్రారంభించాడు. బురద నీటిలో యోగా చేశాడు. చెప్పులు శుభ్రం చేసుకొని, బట్టలు కూడా ఉతుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలోని వ్యక్తిని హంజా పోరాలిగా గుర్తించారు.

కాగా రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి వ్యతిరేకంగా కేరళలో గత వారం అనేక నిరసనలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ ఆందోళనలు ఏ రాజకీయ నాయకుడి దృష్టిని ఆకర్షించలేకపోయాయి. ఇదిలా ఉండగా అయిదు రోజుల క్రితం ఎర్నాకుళం జిల్లాలోని నెడుంబస్సేరి వద్ద జాతీయ రహదారిపై గుంతల కారణంగా 52 ఏళ్ల వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. అతనిపై ట్రక్కు వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో వారం రోజుల్లోగా తమ ఆధీనంలోని ప్రతి రోడ్డును బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను కేరళ హైకోర్టు ఆదేశించింది. 

మరిన్ని వార్తలు