పోయిన నగలు ‘భలే’గా దొరికాయి.. సుందరి ప్రాణం లేచొచ్చింది

16 Jun, 2022 21:23 IST|Sakshi

అరుదైన ఘటనలు అంటారు కదా! ఆ జాబితాలో ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన కచ్చితంగా ఉంటుంది. బంగారం తాకట్టు పెట్టి బాకీలు తీర్చాలనుకున్న ఓ తల్లికి.. ఊహించని కష్టం వచ్చిపడింది. ఆమె మంచి మనసే.. ఆమెతో కన్నీళ్లు పెట్టించింది. చివరకు పోలీసుల ప్రయత్నంతో కథ సుఖాంతం కావడమే కాదు.. పోయిన ఆమె పది తులాల బంగారం ఓ డ్రైనేజీలో ‘భద్రం’గా దొరికింది కూడా.

ఆమె అదృష్టం చేజారిపోలేదని నిరూపించిన ఘటన..  మహారాష్ట్ర ముంబై ఆరే కాలనీలో జరిగింది. స్థానిక నివాసి అయిన 45 ఏళ్ల సుందరి ప్లనిబెల్‌..  గోరేగావ్‌ గోకుల్ ధామ్ కాలనీలోని ఇళ్లలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. తనకున్న పది తులాల బంగారు నగలను.. బ్యాంకులో డిపాజిట్ చేసి అప్పులు తీర్చాలని అనుకుందామె. జూన్‌ 13వ తేదీన పని ముగించుకుని బ్యాంకుకు వెళ్తున్న టైంలో.. ఓ ఇంటి ఓనర్‌ మిగిలిపోయిన కడక్‌ పావ్‌ను సుందరికి ఇచ్చింది. అయితే సుందరి బ్యాంకుకు వెళ్తున్న మార్గంలో.. ఓ తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని కనిపించింది. బిడ్డ ఆకలితో ఉందేమో అనుకుని తన దగ్గరున్న కడక్‌పావ్‌ సంచిని ఆ తల్లికి ఇచ్చేసిందామె. 

తీరా బ్యాంకుకు వెళ్లి చూడగా, తన వద్ద ఉండాల్సిన నగలు కనిపించలేదు. రోడ్డు మీద కనిపించిన ఆ తల్లికి ఇచ్చిన సంచిలోనే నగలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది. పరుగున వెళ్లి ఆ తల్లీబిడ్డల కోసం చూసింది. కానీ, వాళ్లు కనిపించలేదు. ఆలస్యం చేయకుండా.. దిన్‌దోషి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని జరిగిందంతా చెప్పి విలపించింది సుందరి. ఆ నగలు లేకపోతే అప్పులు తీర్చలేనని, తనకు చావే శరణ్యమని పోలీసులను వేడుకుంది. దీంతో ఆమె కన్నీళ్లకు కరిగిపోయి.. పోలీసులు రంగంలోకి దిగారు. 

కనిపించకుండా పోయిన ఆ తల్లీబిడ్డల ఆచూకీ కోసం ఏరియాలో అందరినీ అడిగారు. చుట్టుపక్కల గల్లీలన్నీ జల్లెడ పట్టారు. రెండు గంటల వెతుకులాట తర్వాత.. మొత్తానికి వాళ్లను దొరకబుచ్చుకున్నారు. అయితే.. ఆ బ్రెడ్డు మీద ఆసక్తి లేకపోవడంతో అక్కడే చెత్త కుప్పలో దానిని పడేశామని ఆ తల్లి చెప్పడంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవేళ చెత్త వ్యాను గనుక దానిని ఎత్తేసి ఉంటే పరిస్థితి ఏంటని అనుకుంటూనే.. ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చెత్తలో ప్రతీ సంచినీ క్షుణ్ణంగా వెతికి చూశారు. లాభం లేకపోయింది. ఈ సమయంలో.. 

అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాపై ఏఎస్సై సూరజ్‌ రౌత్‌ కన్నుపడింది. దానిని పరిశీలించాడాయన. అయితే అందులో ఓ సంచి దానికి అదే కదులుతూ వెళ్లడం ఆయన్ని ఆశ్చర్యపరిచింది. అందులో బ్రెడ్డు ఉండడంతో అది ఎలుకల పనే అని నిర్ధారించుకున్నారు. వెంటనే.. దగ్గర్లోని ఎలుకల కలుగులను పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. చెత్త కుప్పకు కాస్త దగ్గర్లో.. మురికినీరు పోయే ఓ రంధ్రంలో ఎలుకలు అటు ఇటు కదలాడుతున్నాయి. ఆ రంధ్రం నుంచి తొంగి చూసిన పోలీసులకు ఓ బ్యాగ్‌ కనిపించింది. వెంటనే దానిని బయటకు తీసి చూడగా.. అందులో నగలు భద్రంగానే ఉన్నాయి. ఆ నగలను అలాగే అప్పగించిన దిన్‌దోషి పోలీసులకు  కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపింది ఆ తల్లి.  నమ్మశక్యంగా లేదు కదూ!.

మరిన్ని వార్తలు