అడవి దాటి గ్రామంలో చొరబడ్డ నమీబియా చీతా.. స్థానికులు హడల్..

2 Apr, 2023 15:14 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్ కునో నేషనల్‌ పార్కులో ఉన్న నమీబియాలో చీతాల్లో ఒకటి అడవి దాటి బయటకు వెళ్లింది. ఫారెస్ట్ ఏరియా నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జార్ బరోడా గ్రామంలో చొరబడింది. దీంతో చీతాను చూసి గ్రామస్థులు హడలిపోతున్నారు.  ఈ చీతా పేరు ఒబాన్. 

విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు వెంటనే ప్రత్యేక బృందంతో రంగంలోకి దిగారు. చీతా జాడ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దాన్ని తిరిగి అడవికి తరలించేందుకు శ్రమిస్తున్నారు. అయితే చీతా తమ ఊర్లోకి చొరబడిన దృశ్యాలను గ్రామస్థుడు ఒకరు వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.

కాగా.. భారత్‌లో అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికాతో భారత్‌ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే గతేడాది ప్రధాని మోదీ జన్మదినం సందర్బంగా 8 చీతాలను నమీబియా నుంచి తీసుకొచ్చి కునో జాతీయ పార్కులో విడుదల చేశారు. అయితే వీటిలో ఒకటి ఇటీవలే కిడ్నీ సమస్యతో చనిపోయింది. ఆ తర్వాత రెండు మూడు రోజులకే మరో చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.

ఈ చీతాల తర్వాత దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలను కూడా భారత్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇవి కూడా అడవిలోనే క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్నాయి. కొద్ది రోజుల తర్వాత వీటిని స్వేచ్ఛగా విడిచిపెడతారు.
చదవండి: రెండో పెళ్లి కావలి అంటూ పోలీస్టేషన్‌లో వధువు హల్‌చల్‌! మద్యంమత్తులో ఊగిపోయి..

మరిన్ని వార్తలు