ఏమిటీ మహిళా రిజర్వేషన్ల బిల్లు? .. ఆ(మె) బిల్లు వెనక

20 Sep, 2023 04:53 IST|Sakshi

దశాబ్దాలుగా చర్చలకే పరిమితమైన మహిళా బిల్లు 

పార్టీలన్నీ సమర్థిస్తున్నా పార్లమెంట్‌ ఆమోదం మాత్రం ఇన్నాళ్లుగా ఎండమావే  

మహిళలకు చట్ట సభల్లో, ముఖ్యంగా లోక్‌సభ, అసెంబ్లీల్లో మూడో వంతు రిజర్వేషన్లు.. దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా చర్చలో ఉన్నఅంశం. అదే సమయంలో, అంతేకాలంగా విజయవంతంగా పెండింగ్‌లోనూ ఉన్న అంశం. అన్ని పార్టీలూ ఇందుకు మద్దతు తెలిపేవే. కానీ తీరా సదరు పార్లమెంటులో బిల్లు రూపంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు మాత్రం ఆమోదం పొందకపోవడం, చివరికి సంబంధిత లోక్‌ సభ కాలపరిమితి తీరడం, దాంతో బిల్లుకు కూడా కాలదోషం పట్టడం... ఇదీ వరస!

1989లో తెరపైకి... 
మహిళలకు చట్ట సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం దివంగత ప్రధాని రాజీవ్‌ గాందీతో మొదలైంది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో వారికి 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆయన హయాంలో, అంటే 1989లో పార్లమెంటులో బిల్లు పెట్టారు. అయితే అది లోక్‌ సభలో ఆమోదం పొందింది గానీ రాజ్యసభలో గట్టెక్కలేదు. అనంతరం తెలుగు తేజం పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా 1992, 1993లో ఈ మేరకు 72 73వ రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టారు. వాటిని ఉభయ సభలూ ఆమోదించాలి. అలా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లోని స్థానాలు, చైర్‌ పర్సన్‌ పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వ్‌ అయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు స్థానిక సంస్థలకు ఎన్నికయ్యేందుకు ఇది దోహదం చేసింది. 

దేవేగౌడ నుంచి మన్మోహన్‌ దాకా.. 
లోక్‌ సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదిస్తూ తొలిసారిగా 1996లో దేవేగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ సర్కారు పార్లమెంటులో 81వ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టింది. కానీ లోక్‌ సభా ఆమోదం పొందలేక అది కాలగర్భంలో కలిసిపోయింది. అనంతరం అటల్‌ బిహారీ వాజపేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 1998, 1999ల్లోనూ, ఆ తర్వాత 2002, 2003ల్లోనూ నాలుగుసార్లు బిల్లు పెట్టినా మోక్షానికి నోచుకోలేదు.

2004లో యూపీయే ఈ అంశాన్ని తమ కనీస ఉమ్మడి ప్రణాళికలో చేర్చింది. అధికారంలోకి వచ్చాక 2008లో మన్మోహన్‌ సింగ్‌ సర్కారు ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. అక్కడినుంచి స్టాండింగ్‌ కమిటీకి వెళ్ళడం, దాని నివేదికను కేంద్రం ఆమోదించడం, చివరికి రాజ్యసభ మహిళా బిల్లును ఆమోదించడం జరిగిపోయాయి. అయితే అదంతా సులువుగా ఏమీ జరగలేదు.

బిల్లును వ్యతిరేకించిన పలువురు ఎంపీలను మార్షల్స్‌ సాయంతో బయటికి పంపి మరీ ఓటింగ్‌ నిర్వహించాల్సి వచ్చింది. ఇంతా చేస్తే, ఆ బిల్లు దిగువ సభ అయిన లోక్‌ సభ ముందుకు రానే లేదు. చివరికి 2009లో 15వ లోక్‌ సభ రద్దుతో అలా పెండింగులోనే ఉండిపోయింది. కాకపోతే శాశ్వత సభ అయిన రాజ్యసభ ఆమోదం పొందింది గనక నేటికీ కాలదోషం పట్టకుండా అలాగే ఉంది. 

ఏమిటీ మహిళా రిజర్వేషన్ల బిల్లు? 
లోక్‌ సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు మూడింట ఒక వంతు,అంటే 33 శాతం స్థానాలను కేటాయించడం దీని ముఖ్యోద్దేశం. ఈ మేరకు వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడం, లోక్‌ సభలో మంగళవారం ఈ మేరకు ప్రవేశపెట్టడం తెలిసిందే.ఆ మూడు అసెంబ్లీల్లో అత్యధికం... అసెంబ్లీలో మహిళలకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పించిన ఘనత ఛత్తీస్గఢ్‌ దే! అయితే అక్కడ వారు ఎందరున్నారో తెలుసా? కేవలం 14.4 శాతం! 13.7 శాతంతో పశ్చిమ బెంగాల్‌ రెండో స్థానంలో, 12.35 శాతంతో జార్ఖండ్‌ మూడో స్థానంలో ఉన్నాయి. 

  • 15 అసెంబ్లీల్లో 10% కన్నా తక్కువ... గోవా, గుజరాత్,హిమాచల్‌ ప్రదేశ్, కర్ణాటక,కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ,ఒడిశా, సిక్కిం, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, అసోం. 
  • 7 అసెంబ్లీల్లో 0–12% కన్నాతక్కువ... బీహార్, హరియాణా,పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ. 

లోక్‌సభలో 15 శాతమైనా లేరు... 
లోక్‌ సభలో ప్రస్తుతం మహిళా ఎంపీల సంఖ్య 78.మొత్తం సంఖ్య 543లో ఇది 15 శాతం కూడా కాదు.  

రాజ్యసభలో కూడా మహిళా ఎంపీలు 14 శాతమే ఉన్నారు. - సాక్షి, నేషనల్‌ డెస్క్‌    

మరిన్ని వార్తలు