Nawab Malik Bail Denied: మనీలాండరింగ్‌ కేసు.. మాజీ మంత్రికి చుక్కెదురు

30 Nov, 2022 17:25 IST|Sakshi

ముంబై: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్‌ మాలిక్‌కు ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్‌ కేసులో ఆయన అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే.. బెయిల్‌ కోసం ఆయన దాఖలు చేసిన అభ్యర్థను బుధవారం తిరస్కరించింది.

మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, అతని అనుచరులతో సంబంధాల అభియోగాలు.. ఆపై లావాదేవీల కారణంగా మనీలాండరింగ్‌ కేసు ఈ మహారాష్ట్ర మాజీ మంత్రిపై దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెయిల్‌ కోసం ఆయన ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ప్రత్యేక న్యాయమూర్తి ఆర్‌ఎన్‌ రోకడే అభ్యర్థనను తిరస్కరించారు. 

మనీలాండరింగ్‌ కేసులో తనను విచారించేందుకు ఎలాంటి కారణాలు లేవని, కాబట్టి బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. అయితే.. దర్యాప్తు సంస్థ మాత్రం ఈ కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు అనే కారణం ఒక్కటి చాలని, ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టుకు నివేదించింది. ఈ బెయిల్‌ పిటిషన్‌పై నవంబర్‌ 14వ తేదీన వాదనలు పూర్తికాగా.. ఆదేశాలను రిజర్వ్‌ చేశారు న్యాయమూర్తి. తాజాగా.. ఇవాళ బెయిల్‌ తిరస్కరిస్తున్నట్లు తీర్పు వెలువరించారు.

నవాబ్‌ మాలిక్‌ను.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈ ఫిబ్రవరిలో అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్న ఆయన.. నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు