డీసీడబ్ల్యూ చీఫ్‌ను ఈడ్చుకెళ్లిన ఘటన.. ఢిల్లీ పోలీసులకు అల్టిమేటం జారీ

19 Jan, 2023 20:21 IST|Sakshi

ఢిల్లీ: దేశ రాజధాని పోలీసులకు జాతీయ మహిళా కమిషన్‌ తాజాగా అల్టిమేటం జారీ చేసింది. ఢిల్లీ మహిళా కమిషన్‌ స్వాతి మలివాల్‌ను వేధించిన  వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యల పూర్తి నివేదికను రెండు రోజుల్లోగా తమ ముందు ఉంచాలని ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ.. ఢిల్లీ పోలీసులను ఆదేశించారు. 

స్వాతి మలివాల్‌తో తప్పతాగిన ఓ వ్యక్తి బుధవారం అర్ధరాత్రి పూట అనుచితంగా ప్రవర్తించాడని, కారుతో పాటు కొద్దిదూరం లాక్కెళ్లాడని మీడియాలో వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకుంది జాతీయ మహిళా కమిషన్‌. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ.. ఢిల్లీ కమిషనర్‌కు రేఖా శర్మ లేఖ రాశారు. అంతకు ముందు ఇదే విషయంపై ఆమె ట్వీట్‌ కూడా చేశారు. 
కారుతో ఈడ్చుకెళ్లిన తాగుబోతు!

ఇదిలా ఉంటే.. ఢిల్లీలో మహిళ భద్రతను పర్యవేక్షించే క్రమంలో ఎయిమ్స్‌ గేట్‌ వద్ద అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో తన టీంతో నిఘా పెట్టారు డీసీడబ్ల్యూ చీఫ్‌  స్వాతి మలివాల్‌. అయితే తప్పతాగి కారులో వచ్చిన వ్యక్తి ఆమెతో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు ప్రతిఘటించే సమయంలో ఆమెను కారుతో పాటు లాక్కెళ్లే యత్నం చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్వాతి మలివాల్‌.. భగవంతుడి దయతో బయటపడ్డానని, లేకుంటే తాను మరో అంజలి సింగ్‌ను అయ్యేదానిని అంటూ వ్యాఖ్యానించారు కూడా.

ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి.. నిందితుడిని అరెస్ట్‌ చేయడంతో పాటు కారును పోలీసులు సీజ్‌ చేశారు కూడా.

మరిన్ని వార్తలు